Baahubali Animated Series : బాహుబలి సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ముందు వేల కోట్లు వసూలు చేసింది. తెలుగు సినిమా ఖ్యాతిని వరల్డ్ వైడ్గా పెంచింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని యానిమేటెడ్ సిరీస్ రూపంలో తీసుకురానున్నారు. ఈ సందర్భంగా మూవీటీమ్ ప్రెస్ మీట్ నిర్వహించి పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. ఇందులో భాగంగా దర్శకధీరుడు జక్కన్న బాహుబలి సినిమాను థియేటర్లలో ఎంత మంది చూశారో తెలిపారు.
"బాహుబలి సిరీస్ భారీ సక్సెస్ను సాధించాయి. దేశంలో 140 కోట్ల మంది ఉంటే 120 కోట్ల మంది చూశారనుకుందాం. అయితే ఈ బాహుబలిని థియేటర్‌లో చూసింది మాత్రం దాదాపుగా కేవలం 10 కోట్ల మంది ప్రేక్షకులు మాత్రమే. అంటే ఈ లెక్కన 10 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. దీనర్థం 110 కోట్ల మంది థియేటర్‌లో అస్సలు ఈ సినిమానే చూడలేదు. ఎందుకంటే టీవీ, ఓటీటీలో చూసి ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా చూసి ఉంటారు. కథలను చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అందరూ రెగ్యులర్ సినిమాలనే చూడకపోవచ్చు. కేవలం యానిమేషన్ చిత్రాలనే చూసే ప్రేక్షకులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈ బాహుబలిని తీసుకొస్తున్నాం. అయినా ఓ సినిమాను తెరకెక్కించాలంటే చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సంభాషణలు, ఫైట్స్, సాంగ్స్ ఇలా చాలా ఉంటాయి. కానీ, యానిమేషన్‌లో అవేమి ఉండవు. వర్కౌట్ కాదు. వరుసగా ఎపిసోడ్స్ చూసే కొద్ది బాగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా బాహుబలి, కట్టప్ప పోటీ పడే సన్నివేశాలు చాలా బాగా ఉంటాయి. ఇది బాహుబలికి ప్రీక్వెల్, సీక్వెల్ కాదు. బాహుబలి కథ మధ్యలో ఏం జరిగిందనేదే? ఈ సిరీస్. సినిమాలో నిడివి కారణంగా కథను విసృత్తంగా చెప్పలేం. తెరపై చూపించలేం. అందుకే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌లో పూర్తి కథను చూపించబోతున్నాం" అని జక్కన్న పేర్కొన్నారు. కాగా, రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నారు.