Balakrishna AnilRavipudi : హిందూపురం తేదేపా కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు. వరుసగా మూడోసారి కూడా విజయభేరి మోగించారు. తాజా ఎన్నికల్లో తన సమీప వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై విజయం సాధించారు. దాదాపు 31,602 ఓట్లతో గెలుపొందారు. అయితే ఈ విజయంపై బాలయ్యకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు ఆయనకు విషెస్ చెబుతున్నారు. సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ క్రమంలోనే సినీ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తనదైన స్టైల్లో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
అనిల్ రావిపూడి బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ అందుకుని సూపర్ హిట్ అందుకుంది. అయితే అందులోని ఒక పవర్ ఫుల్ వీడియో క్లిప్‌ను జత చేస్తూ, అభినందనలు తెలిపారు అనిల్ రావిపూడి. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్‌లకు కూడా అభినందనలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
కాగా సీనియర్ ఎన్టీ రామారావు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే హిందూపురం తేదేపా కంచుకోటగా ఉంది. ఎన్టీఆర్ కూడా ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఇప్పుడు బాలయ్య 2014 నుంచి ఆ స్థానంలో విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014లో 81,543 ఓట్ల మెజార్టీతో విజయఢంకా మోగించిన ఆయన 2019లోనూ 91,704 వేల ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని అందుకున్నారు. కానీ 2019లో తేదేపా ఓడిపోవడం వల్ల బాలకృష్ణ ప్రతిపక్ష నేతగానే కొనసాగారు. ఇప్పుడు 2024లోనూ సమీప వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికను భారీ మెజారిటీతో ఓడించి మరోసారి విజయకేతనం ఎగరవేశారు.