Gadar 2 Ameesha Patel : సన్నీ దేవోల్, అమీషా పటేల్ జంటగా నటించిన చిత్రం గదర్ 2. అనిల్‌శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ శర్మ ఈ సినిమా విశేషాలు తెలిపారు. అత్త పాత్రలో నటించడానికి అమీషా పటేల్ అంగీకరించలేదని ఆయన అన్నారు. "నర్గీస్ దత్ వంటి గొప్ప తారలు కూడా చిన్న వయసులోనే అత్తయ్య పాత్రలు చేశారని ఎంతో నచ్చజెప్పా. అయినా ఆమె మాత్రం చేయనని చెప్పేసింది" అని అనిల్ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై అమీషా పటేల్ స్పందించింది. దర్శకుడి తీరుపై అసహనం వ్యక్తం చేసింది. "డియర్ అనిల్. ఇది కేవలం సినిమా మాత్రమే. రియల్ లైఫ్‌లో ఓ కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి, ఆన్‌స్క్రీన్‌లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. మీరంటే నాకెంతో గౌరవం ఉంది. గదర్ కోసమే కాదు, ఏ చిత్రం కోసమైనా నేను అత్తయ్య పాత్రలు చేయను. రూ.100 కోట్లు ఇచ్చినా కూడా ఆ పాత్ర చేయడానికి అస్సలు అంగీకరించను" అని ఆమె పేర్కొన్నారు.
కాగా, దర్శకుడు అనిల్ శర్మ గురించి అమిషా పటేల్ ఈవిధంగా స్పందించడం ఇది మొదటి సారి కాదు. తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా అనిల్ 'గదర్ 2' క్లైమాక్స్ మార్చేశారని గతంలో అమీషా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన కొడుకు ఉత్కర్ష్ శర్మ (గదర్ 2 లో చరణ్‌జీత్ రోల్‌లో కనిపించాడు) పాత్రను హైలైట్ చేయడం కోసమే ఆయన ఆ విధంగా చేశారని ఆమె పేర్కొన్నారు.