'పుష్ప పేరు చిన్నదే, కానీ సౌండ్ ఎక్కువ'
'పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్'
'పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా, ఇంటర్నేషనల్'
'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటిరా, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్'
మరో వారం రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్ చేసేందుకు సిద్ధమైన పుష్పగాడి గురించి మూవీటీమ్ చెబుతున్న మాటలివి. అందుకు తగ్గట్టే సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఇదే సమయంలో సినిమాలో యాక్షన్‌తో పాటు ఆడియెన్స్‌ను ఏడిపించేసే రేంజ్లో మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని తెలిసింది. 'తగ్గేదేలే' అన్న పుష్పగాడి యాటిట్యూడ్‌కు ఈ సారి ఎమోషనల్ రైడ్ తోడై ప్రేక్షకులను కంటతడి పెట్టించనుందట.
అప్పుడేమో యాటిట్యూడ్ - తొలి భాగంలో ఒక సాధారణ కూలీగా జీవితం ప్రారంభించిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడో అదిరిపోయేలా చూపించారు దర్శకుడు సుకుమార్. అయితే ఈ ఎదిగే క్రమంలో పుష్ప రాజ్ ఎవరి దగ్గర తలవంచడు. ఆ కాలు నాదే, ఈ కాలు నాదే అంటూ, ఎంతటి వాడు ముందైనా కాలు మీద కాలేసి కూర్చిని యాటిట్యూడ్ చూపిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌కు నాయకుడు అవుతాడు. సినిమా మొత్తం తన సిగ్నేచర్‌తో యాటిట్యూడ్ చూపిస్తూ కింగ్ మేకర్ అవుతాడు.
అయితే ఈ మొదటి భాగంలో ఎమోషన్ సీన్స్ విషయానికొస్తే, తల్లికి జరిగిన అన్యాయం, ఇంటి పేరు లేని వ్యక్తిగా పుష్పను చూపిస్తూ అక్కడక్కడా ఎమోషన్ పండించారు. మొత్తంగా తొలి భాగంలో ఎమోషన్ కన్నా ఎక్కువగా యాక్షన్ పార్ట్‌కే పెద్ద పీట వేశారు.
ఇప్పుడేమో ఎమోషనల్ - అయితే ఇప్పుడు రెండో భాగం సీక్వెల్లో అలా కాకుండా యాక్షన్‌తో పాటు దీటుగా ఎమోషనల్ సీక్వెన్స్‌కు పెద్ద పీట వేశారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించి వచ్చిన రివ్యూలను పరిశీలిస్తే 'పుష్ప 1' చిత్రంతో పోలిస్తే పుష్ప 2 సినిమాలో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. ఈ సారి మదర్ సెంటిమెంట్‌తో పాటు భార్య శ్రీవల్లితో వచ్చే ఎమోషనల్ బాండింగ్ సీన్స్, సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. సినిమా మొత్తం ఎమోషనల్ రైడ్‌గా సాగుతుందని చెబుతున్నారు.
'శ్రీవల్లి అంటే నా ప్రాణం'
'పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా'