తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

లక్ష్మీపతి పాత్ర - ఆయనకు మిస్సై కోటా శ్రీనివాసరావుకు అలా దక్కింది! - Aha Naa Pellanta Movie - AHA NAA PELLANTA MOVIE

Aha Naa Pellanta Kota Srinivasa Rao : అహ నా పెళ్లంట సినిమాలో పిసినారి పాత్రను ముందుగా కోట శ్రీనివాసరావుతో తీయాలనుకోలేదట నిర్మాత రామానాయుడు. డైరక్టర్ జంధ్యాల మొండిపట్టే ఆయనకు ఆ పాత్ర దక్కేలా చేసిందట. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
Kota Srinivasarao (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 9:37 PM IST

Aha Naa Pellanta Kota Srinivasa Rao :ఎవరైనా పిసినారి గురించి చెప్పాలంటే ముందుగా రిఫరెన్స్ తీసుకుని చెప్పేది అహ నా పెళ్లంట సినిమాలోని కోట శ్రీనివాసరావు క్యారెక్టరే. కోడిని వేలాడదీసుకుని చికెన్ తింటున్నానని చెప్తుంటే, వినేవాళ్లతో పాటు చూసేవాళ్లకు కూడా పిచ్చెక్కిపోతుంది. ఆ పాత్రను అంత బాగా డైరక్టర్ జంధ్యాల తెరకెక్కిస్తే, దానికి ప్రాణం పోశారు కోట శ్రీనివాసరావు. అరగుండు క్యారెక్టర్లో బ్రహ్మానందం, పిసినారి లక్ష్మీపతి పాత్రలో కోటా బాగా రక్తి కట్టించడంతో పాత్రలు గుర్తుండిపోయాయి.

ఈ లక్ష్మీపతి పాత్ర కోట శ్రీనివాసరావు కోసమే రాశారా అనేంతలా ఒదిగిపోయారాయన. వాస్తవానికి ముందుగా ఈ పాత్రలో ఆయనను తీసుకోవాలని అనుకోలేదట. డైరక్టర్ జంధ్యాల కావాలని మొండిపట్టు పట్టడంతో నిర్మాత రామానాయుడు కాంప్రమైజ్ అయి నిర్ణయం మార్చుకున్నారు. ముందుగా అప్పటికీ సక్సెస్‌ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న రావు గోపాలరావు గారిని పెట్టి సినిమా తీయాలనుకున్నారట. అప్పటికే కోటా శ్రీనివాసరావు నటించిన 'మండలాధీశుడు' సినిమాను చూసిన జంధ్యాల లక్ష్మీపతి పాత్రను కోటానే చేయాలని ఫిక్స్ అయిపోయారట. అలా ఆ పిసినారి పాత్ర ఆయన్ను వరించింది.

ఈ విషయాన్ని స్వయంగా కోట శ్రీనివాసరావే బయటపెట్టారు. "ఒకరోజు చెన్నై వెళ్లేందుకు బయల్దేరి ఎయిర్‌పోర్టుకు వెళ్లా. నా కంటే ముందుగానే అక్కడికి చేరుకున్నారు రామానాయుడు గారు. అప్పట్లో నాలాంటి నటుడు ఆయనకు ఎదురుగా కూర్చొని మాట్లాడటమే పెద్ద విషయం. నన్ను చూడగానే "ఇక్కడకు రావయ్యా. నీతో ఒక విషయం చెప్పాలి" అని అన్నారు. ఆయన దగ్గరకు వెళ్లి విషయమేమిటని అడిగేసరికి "జంధ్యాలతో ఒక సినిమా ప్లాన్ చేశాను. ఫైనలైజ్ కూడా అయిపోయింది. ఆ స్క్రిప్ట్ లో ఒక క్యారెక్టర్ ఉంది. దాని మీదే కథ ఆధారపడి ఉంటుంది. అది సక్సెస్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది. లేదంటే యావరేజ్‌గా మిగిలిపోతుంది. ఆ పాత్ర గురించి నేను, జంధ్యాల 20 రోజులుగా చర్చించుకుంటున్నాం. రావు గోపాలరావుతో వేయిద్దామని నేను అనుకుంటుంటే, కోట శ్రీనివాసరావే చేయాలని ఆయన పట్టుబట్టారు. దానికి నేను ఒప్పుకున్నా. నీ డేట్స్ ఒక 20 రోజులు కావాలి" అని అడిగారు. వెంటనే తప్పకుండా ఇస్తాను సర్ అనేశాను. ఆ తర్వాత సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ పాత్రతో నాకు మంచి పేరు వచ్చింది" అని ఆ సంగతులు గుర్తు చేసుకున్నారు కోట శ్రీనివాసరావు.

ABOUT THE AUTHOR

...view details