Pragya Jaiswal About Balakrishna :రిలీజైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ దూసుకెళ్తోంది 'డాకు మహారాజ్'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాలయ్య ఎప్పటిలాగే తన నటనతో అభిమానులను అలరించగా, కావేరిగా మెరిసి ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఆకట్టుకున్నారు. గతంలో ఈమె బాలయ్యతో 'అఖండలో నటించగా, అది కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె బాలయ్యతో వర్క్ చేయడం గురించి మాట్లాడారు. ఆయనతో వరుస సినిమాల్లో నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"ఆయన ఓ లెజెండ్. బాలకృష్ణ పేరు చెప్పగానే నాకు 'పాజిటివిటి' అనే పదం గుర్తొస్తుంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పగల వ్యక్తి ఆయన. అందరినీ ఒకలాగే గౌరవిస్తారు. చాలా మంచి మనిషి. రోల్‌కు తగ్గట్లుగా యాక్టర్లను ఎంపిక చేస్తారు. అంతే తప్ప వారి వయసును చూసి సినిమా అవకాశాలు ఇవ్వరు. నా పాత్రకు నేను వందశాతం న్యాయం చేశానా, లేదా అనేదే ఆలోచిస్తాను. నా దృష్టిలో ఏజ్ అనేది అసలు సమస్యే కాదు. 'అఖండ'లో మా ఇద్దరినీ స్క్రీన్‌పై చూసి నేను ఆశ్చర్యపోయాను" అని ప్రగ్యా చెప్పుకొచ్చారు.