Actor Shiva Rajkumar Health Update : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న శాండల్‌వుడ్ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ తాజాగా చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడి ఒక ప్రముఖ ఆస్పత్రిలో ఆయనకు డిసెంబర్ 24న సర్జరీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఎయిర్‌పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఈ విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
"నా కో స్టార్స్ అలాగే అభిమానుల నుంచి పొందుతోన్న ప్రేమాభిమానం, ఆశీస్సులకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నా ఆరోగ్యం విషయంలో సంయమనం పాటించిన మీడియాకు నా ధన్యవాదాలు. అంతా మంచిగానే జరుగుతుంది. సర్జరీ కోసం ఇంటిని వదిలి వెళ్తున్నప్పుడు ఎవరికైనా కాస్త ఆందోళనగానే ఉంటుంది. కానీ సాధారణంగా నేను చాలా ధైర్యంగా ఉంటాను. అయితే ఇప్పుడు మాత్రం ఇంటి నుంచి వస్తోన్న సమయంలో నా కుటుంబసభ్యులు, అలాగే అభిమానులను చూసినప్పుడు నేను కాస్త ఎమోషనల్‌గా అయ్యాను. సర్జరీ పూర్తయిన తర్వాత 'యూఐ', అలాగే 'మ్యాక్స్' సినిమాలు చూస్తాను" అని శివ రాజ్‌కుమార్ అన్నారు.
ఇక ట్రీట్‌మెంట్ తర్వాత శివ రాజ్‌కుమార్ సుమారు నాలుగు వారాల పాటు అక్కడే ఉండనున్నారని సమాచారం. అయితే అమెరికా వెళ్లడానికి ముందు శివ రాజ్‌కుమార్ నివాసంలో ఓ పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు శివన్న ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. అంతేకాకుండా ఆయనకు ధైర్యం కూడా చెప్పారు.