27 Crore Remuneration Heroine: బాలీవుడ్లో ఒకట్రెండు ఫ్లాపులు పడితే చాలు, ఆ హీరోయిన్ అవకాశాలు, డిమాండ్ తగ్గడం మామూలే. ఇక రెండుమూడేళ్లు సినిమాల్లో కనిపించకపోతే ప్రేక్షకులు తమను మర్చిపోతారేమోనని ఆందోళన చెందుతుంటారు. అలాంటిది ఓ హీరోయిన్‌కు దాదాపు 9ఏళ్ల నుంచి సరైన హిట్ సినిమా లేదు. అది కాకుండా ఆమె చుట్టూ ఎన్నో వివాదాలు. అయినప్పటికీ ఇవన్నీ కూడా 2023లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ లిస్ట్‌లో ఆమె పేరు చేరకుండా ఆపలేకపోయాయి. ఈ నటి ఎవరో కాదు బీటౌన్ బ్యూటీ కంగనా రనౌత్. ఈ భామ ప్రస్తుతం ఒక్కో సినిమాకుగాను రూ.27 కోట్ల పారితోషికం అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
తన నటనతో కంగనా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. అందులో ముఖ్యంగా 'క్వీన్', 'తను వెడ్స్ మను' సినిమాలు సూపర్ హిట్ కావడమే కాకుండా ఆమెకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టాయి. అయితే అదంతా గతం. 2015 తర్వాత సీన్ మారింది. ఈ సంవత్సరం విడుదలైన 'తను వెడ్స్ మను- 2' తర్వాత కంగనాకు సరైన హిట్ లేదు.
2015-18 దాదాపు మూడేళ్లు కంగనాకు బ్యాడ్‌టైమ్ నడిచిందనే చెప్పాలి. అయితే 2018లో తెలుగు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించిన 'మణికర్ణిక' యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా రూ.100కోట్లు వసూల్ చేసినప్పటికీ, దాని బడ్జెట్‌తో పోల్చుకుంటే తక్కువే. ఇక ఆమె చివరి మూడు సినిమాలు 'తేజస్', 'ధాకడ్', 'తలైవీ' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. కానీ, ఈ సినిమాల్లో కంగనా నటనుకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.