Toughest Exams In India :ఇండియాలో విద్యార్థులకు, నిరుద్యోగులకు కొదవ లేదు. వీరు నిత్యం ఏదో ఒక ఎంట్రన్స్ టెస్ట్, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. అయితే వీటిలో అత్యంత కఠినమైన పరీక్షలు ఏమిటి? ఏటా ఈ టఫెస్ట్ ఎగ్జామ్స్ ఎంత మంది రాస్తుంటారు? అనేది ఇప్పుడు చూద్దాం.
1. UPSC CSE (సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్)
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు అత్యంత కఠినమైనవి. ఈ అత్యున్నమైన ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ కాంపిటీషన్ ఉంటుంది. ఏటా సుమారుగా 10 లక్షల మంది ఈ పరీక్షలు రాస్తుంటారు. అయితే వీరిలో కేవలం 0.1 శాతం నుంచి 0.3 శాతం అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. అందుకే దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఒకటిగా నిలిచాయి.
2. IIT - JEE (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్)
భారతదేశంలో ఇంజినీరింగ్ విద్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs) సహా, ప్రీమియర్ ఇంజినీరింగ్ కాలేజ్‌ల్లో సీట్ సంపాదించేందుకు, అభ్యర్థులు అందరూ ఈ 'ఐఐటీ-జేఈఈ' (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్) రాస్తుంటారు. ఏటా సుమారుగా 6 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే, కేవలం 25 శాతం నుంచి 30 శాతం మంది మాత్రమే సెలక్ట్ అవుతుంటారు. అత్యంత కఠినమైన సెలక్షన్ ప్రాసెస్ ఇది.
3. CAT (కామన్ అడ్మిషన్ టెస్ట్)
భారతదేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అడ్మిషన్ కోసం 'కామన్ అడ్మిషన్ టెస్ట్' (సీఏటీ) రాయాల్సి ఉంటుంది. ఇది చాలా కఠినమైన పరీక్ష. ఏటా సుమారుగా 2.30 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే, వారిలో కేవలం 2 శాతం అభ్యర్థులు మాత్రమే సెలక్ట్ అవుతుంటారు.
4. CLAT (కామన్ లా అడ్మిషన్ టెస్ట్)
దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన లా యూనివర్సిటీల్లో సీట్ సంపాదించాలంటే, 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్' రాయాల్సి ఉంటుంది. న్యాయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు చాలా పరిమితంగా ఉంటాయి. పైగా సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఏటా సుమారుగా 60 వేల మంది ఈ 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్' (CLAT) రాస్తే, వారిలో కేవలం 3 శాతం అభ్యర్థులు మాత్రమే ఎంపిక అవుతుంటారు.
5. CA (ఛార్టర్డ్ అకౌంటెంట్)
దేశంలోని అత్యంత కఠినమైన కోర్సుల్లో సీఏ (ఛార్టర్డ్ అకౌంటెంట్) ఒకటి. 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా' (ICAI) ఏటా ఈ సీఏ పరీక్ష నిర్వహిస్తూ ఉంటుంది. ఈ పరీక్ష చాలా హైస్టాండర్డ్స్‌లో ఉంటుంది. ఏటా సుమారుగా 95 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తుంటారు. కానీ వీరిలో కేవలం 25 శాతం మంది మాత్రమే సెలక్ట్ అవుతుంటారు.