తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? 'ఒత్తిడి'ని చిత్తు చేసి, విజయాన్ని చేకూర్చే గొప్ప మంత్రం ఇదే! - Stress Management Tips

Stress Management Tips : మీరు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఒత్తిడి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఎలాంటి ఒత్తిడినైనా చిత్తు చేసి, మీకు విజయాన్ని అందించే 'RRR' మంత్రం గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Take control of your anxiety using the RRR Mantra
Stress Management Tips (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 10:42 AM IST

Stress Management Tips : ఒకప్పుడు ఒత్తిడి అంటే ఏమిటో తెలియకుండా మన పూర్వీకులు బతికారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతున్నారు. చదువుల్లో, పనిలో, ఆ మాటకొస్తే ఏ రంగంలో ఉంటున్నాఒత్తిడికచ్చితంగా ఉంటోంది. దీనితో చాలా మంది ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా అవస్థలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతీ, యువకులు ఒత్తిడికి తట్టుకోలేక చిత్తు అవుతున్నారు. మరి మీరు కూడా ఇలాంటి పరిస్థితిల్లోనే ఉన్నారా? అయినా డోంట్ వర్రీ. 'ట్రిపుల్ ఆర్'​ (RRR) మంత్రంతో మీ ఒత్తిడిని చిటికెలో మాయం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

నిర్లక్ష్యం పనికిరాదు!
పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైనా, పనిలో నిమగ్నమయ్యే ఉద్యోగులైనా, చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. దీనితో చాలా మంది తీవ్రమైన ఒత్తిడికి లోనై శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటారు. దీన్నే 'బర్న్​ అవుట్​' అని పేర్కొంటారు. దీని నుంచి బయటపడాలంటే, కచ్చితంగా 'ట్రిపుల్​ ఆర్​' మంత్రాన్ని పఠిస్తే మంచిదని ఆరోగ్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకూ ఏంటిది? దీనిని ఎలా చేయాలి?

క్రమశిక్షణ ముఖ్యం
పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఎప్పటికప్పుడు టైమ్ టేబుల్​ ప్రకారం తమ సిలబస్​ను పూర్తి చేస్తూ ఉండాలి. ఉద్యోగులు అయితే తమ పనులను నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలి. వీలు చూసుకుని మెల్లగా ఒకదాని తర్వాత మరొకటి చేద్దాంలే అని అనుకుంటే కుదరదు. ముఖ్యంగా బద్దకించకూడదు.

మనుషులకు వివిధ స్థాయిల్లో ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిలను నియంత్రించడానికి 'ట్రిపుల్‌ ఆర్‌' మంత్రం బాగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఒత్తిడి అనేది ఒక స్థాయి వరకు మంచి ఫలితాలనే ఇస్తుంది. ఒక మోస్తరు ఒత్తిడి వల్ల మన పనుల్ని మనం సకాలంలో పూర్తిచేయగలుగుతాం. కానీ విపరీతమైన ఒత్తిడికి గురి అయితే బర్న్‌అవుట్‌ అయ్యి తీవ్రంగా నష్టపోతాం.

ఉదాహరణకు రబ్బర్‌ బ్యాండ్‌ను రెండు వైపులా పట్టుకుని బాగా సాగదీశారు అనుకుందాం. అప్పుడు ఒక దశ వరకూ బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత అది తెగిపోయి, చేతికి చురుక్కుమని తగులుతుంది. దీనిలాగే విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు, మనం బర్న్‌అవుట్‌కు గురి అవుతాం. అయితే ఈ సమస్యను ట్రిపుల్ ఆర్‌ పద్ధతి ద్వారా పూర్తిగా తొలగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

R - రికగ్నైజ్‌ (గుర్తించటం)
ముందుగా మీరు ఏయే సందర్భాల్లో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారో గుర్తించాలి. ఏ పని చేస్తున్నప్పుడు మీరు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారో, దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. మీరు కనుక అసలు కారణాన్ని కనుక్కుంటే, ఒత్తిడి సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

మానసిక ఒత్తిడిలను జయించాలంటే శ్వాస సంబంధిత యోగాభ్యాసాలు చేయడం మంచిది. ముఖ్యంగా దీర్ఘంగా గాలి పీల్చుకుని, దాన్ని కాసేపు అలాగే నిలిపివుంచి, కొన్ని నిమిషాల తర్వాత మెల్లగా బయటకు వదలాలి. ఇలా చేస్తూ ఉంటే, మీలో వచ్చిన మార్పును మీరే స్వయంగా అనుభూతి చెందుతారు.

R - రివర్స్‌ (వెనక్కి తిప్పటం)
ఏ సందర్భాల్లో మీరు ఒత్తిడికి గురవుతున్నారో గుర్తిస్తే, సమస్య నుంచి బయటపడే మార్గాలను త్వరగా అన్వేషించగలుగుతారు. కానీ ఇలా వీలుకానప్పుడు, మరో విధంగానూ ప్రయత్నం చేయవచ్చు. ఒత్తిడికి గురైన సందర్భాల్లో, సాధారణంగానే నిరవధికంగా ఆలోచనలు వస్తుంటాయి. అందువల్ల ముందుగానే ఆ ఆలోచనల్ని నిరోధించాలి. అంటే ఒత్తిడి రాకముందే దాన్ని అధిగమించేందుకు, మీ వంతుగా తగు ప్రయత్నాలను ప్రారంభించాలి.

ఉదాహరణకు, ఒక ప్రాజెక్ట్​ను నిర్దేశిత సమయంలోపు చేయలేమోనని/ లేదా ఒక సబ్జెక్టులో మంచి మార్కులు సాధించలేమోననే ఆలోచనలు పదేపదే వచ్చి, మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు అనుకుందాం. అప్పుడు వీటిని నిరోధించడానికి, అదే ప్రాజెక్టు లేదా సబ్జెక్టుపై పట్టుసాధించాలంటే, ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే దిశగా ఆలోచించాలి. విద్యార్థులైతే తమ అధ్యాపకుల్ని అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలా? ట్యూషన్‌కు వెళ్లాలా? లేదా స్నేహితుల సాయం తీసుకోవాలా? ఇలా వివిధ కోణాల్లో ఆలోచించాలి. మీరు ఇక్కడో విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. సమస్య గురించి పదేపదే ఆలోచించడం వల్ల మీపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. కానీ ఒక్కసారి పరిష్కార మార్గాల దిశగా ఆలోచించడం మొదలుపెడితే, సమస్య తీవ్రత క్రమంగా తగ్గుతుంది.

R - రెసీలియెన్స్‌ (పూర్వస్థితికి రావటం)
ఒత్తిడిని కలిగించే సందర్భాల్లో చిక్కుకున్నప్పుడు, మీరు యథాస్థితికి రావడానికి ప్రయత్నించగలగాలి. ఎంత త్వరగా, తేలికగా ఒత్తిడి నుంచి బయటపడాలనేది ముఖ్యం కాదు. ఒత్తిడిని పూర్తిగా నివారించి పూర్వపు స్థితికి రావడమే ప్రధానం. అందువల్ల ఒత్తిడిని ధ్రువీకరించుకోవడం, దాని గురించి అవగాహన పెంచుకోవడం, శ్వాస సంబంధిత యోగాభ్యాసాలు చేయడం వల్ల, మీరు సులువుగా పూర్వపు స్థితికి రావచ్చు. ఒత్తిడికి గురైన సందర్భాల్లో ఈ సాధనాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరికొన్ని సూచనలు
మన ఒత్తిడి మనకు చాలు. అలా కాకుండా ఇతరులు ఏయే సందర్భాల్లో ఒత్తిడికి గురవుతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. ఇలాచేస్తే, మీరు కూడా అలాంటి సందర్భాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే ఎప్పుడూ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతోనే ఉండాలి. దీంతోఒత్తిడికిదూరంగా, మానసిక ప్రశాంతతకు దగ్గరగా ఉండగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఆల్​ ది బెస్ట్​!

ఐటీఆర్​ ఫైలింగ్​లో ఏమైనా పొరపాట్లు చేశారా? వెంటనే సరిదిద్దుకోండిలా! - How To Correct ITR Mistakes

ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కావాలా? ఆ 'బీమా పాలసీ' తీసుకోవడం మస్ట్​! - Critical Illness Insurance Benefits

ABOUT THE AUTHOR

...view details