CSIR UGC NET 2024 : సీఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2024 (CSIR-UGC NET)కు నోటిఫికేషన్ విడుదలైంది. సైన్స్ విభాగాల్లో పరిశోధనలు చేయాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలని ఆశించే అభ్యర్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులై, సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలు చేసే అభ్యర్థులకు యూజీసీ జేఆర్‌ఎఫ్ కూడా అందిస్తుంది. జేఆర్‌ఎఫ్ అర్హత పొందిన అభ్యర్థులు సీఎస్‌ఐఆర్ పరిధిలోని రీసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు వీరికి విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది.
సీఎస్ఐఆర్-యూజీసీ నెట్-2024 పరీక్ష వివరాలు
5 సైన్స్ విభాగాలకు సంబంధించి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. అవి ఏమిటంటే?
- కెమికల్ సైన్సెస్
- ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్
- లైఫ్ సైన్సెస్
- మ్యాథమెటికల్ సైన్సెస్
- ఫిజికల్ సైన్సెస్
విద్యార్హతలు :
- అభ్యర్థులు కనీసం 55% మార్కులతో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి. లేదా తత్సమాన విద్యార్హతలు/ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్- ఎంఎస్/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
- ఓబీసీ (ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్, దివ్యాంగులు అర్హత పరీక్షలో కనీసం 50% మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి :
- జేఆర్‌ఎఫ్ కోసం అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 2024 జూన్ నాటికి 30 ఏళ్లు మించకూడదు.
- ఓబీసీ (నాన్-క్రిమిలేయర్) అభ్యర్థులకు గరిష్ఠంగా మూడేళ్లు; మహిళలు, దివ్యాంగులు/ ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఇస్తారు.
- పీహెచ్‌డీ ప్రవేశాలకు/అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం అప్లై చేసే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.