Why RBI Stores Gold Reserves In Foreign Vaults : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకే నుంచి సుమారు 100 టన్నుల(లక్ష కేజీలు) బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది. 1991లో భారత్ విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత, ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తిరిగి తీసుకురావడం ఇదే తొలిసారి. రానున్న నెలల్లో మరింత బంగారాన్ని వెనక్కు తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇదంతా చూస్తుంటే, మన బంగారాన్ని విదేశాలలో ఎందుకు ఉంచారన్న సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.
వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతు ఇవ్వడానికి, దేశ ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం నిల్వలను ఉంచుకుంటాయి. డిపాజిటర్లకు, నోట్ హోల్డర్లకు హామీగా బంగారు నిల్వలను ఉపయోగించుకుంటాయి.
అసలు బంగారం నిల్వలే ఎందుకు?
కేంద్ర బ్యాంకులు అనేక కారణాల వల్ల బంగారం నిల్వలను ఉంచుకుంటాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. బంగారాన్ని కలిగి ఉంటే దేశ, విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి సాయపడుతుంది. ముఖ్యంగా ఏదో ఒక కరెన్సీపై మాత్రమే ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
భారత్ దగ్గర ఉన్న బంగారం నిల్వలు ఎంతంటే?
2024 ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం, భారత్ వద్ద దేశీయంగా 308 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. అదనంగా 100.28 టన్నుల బంగారం బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ అసెట్‌గా ఉంది. విదేశాల్లో మన బంగారం ఏకంగా 413.79 మెట్రిక్ టన్నుల వరకు ఉంది. స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబయి, నాగపుర్లోని హై-సెక్యూరిటీ వాల్ట్‌లలో భద్రపరిచారు.
తొమ్మిదో స్థానంలో
827.69 మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్‌లో భారత్ ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక 8,133.5 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ వద్ద కూడా గణనీయమైన స్థాయిలో బంగారు నిల్వలు ఉన్నాయి.
విదేశాల్లో బంగారాన్ని ఎందుకు నిల్వ చేయాలి?
భారత్ అనేక ఇతర దేశాల మాదిరిగానే, తన బంగారం నిల్వలలో కొంత భాగాన్ని విదేశీ వాల్ట్‌లలో నిల్వ చేస్తోంది. బంగారాన్ని ఇతర దేశాలలో నిల్వ చేయడం వల్ల భౌగోళిక, రాజకీయ అస్థిరతలు లేదా ప్రాంతీయ సంఘర్షణలు నుంచి భద్రత లభిస్తుంది. లండన్, న్యూయార్క్, జ్యూరిచ్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు, మార్పిడిలు లేదా రుణాల కోసం పూచీకత్తుగా ఉపయోగించుకోవచ్చు.