Credit Card Grace Period : మన జీవితంలో అకస్మాత్తుగా అనేక ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం క్రెడిట్ కార్డులు నిత్యావసరంగా మారాయి. ఈ రోజుల్లో చెల్లింపులు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు వాడుతున్నవాళ్లు 'గ్రేస్ పీరియడ్' గురించి తెలుసుకోవడం తప్పనిసరి. అసలు ఈ గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి? దీనిని ఎలా తెలివిగా ఉపయోగించుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి?
బిల్లింగ్ తేదీకి, చెల్లింపు గడువు (పేమెంట్ డ్యూ డేట్) తేదీకి మధ్య ఉన్న వ్యవధినే క్రెడిట్ కార్డ్ గ్రేస్ పీరియడ్ అని అంటారు. సాధారణంగా ఇది 21 నుంచి 25 రోజుల వరకు ఉంటుంది. ప్రాథమికంగా దీనిని బఫర్ పీరియడ్ అని అంటారు. ఈ గ్రేస్ పీరియడ్‌లో ఎలాంటి వడ్డీలు, ఛార్జీలు లేకుండా మొత్తం బకాయిని సెటిల్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ ప్రతి నెలా 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉంటుంది అనుకుందాం. మీరు జూన్ 5వ తేదీన ఒక వస్తువు కొనుగోలు చేశారనుకుందాం. అప్పుడు బిల్లు జూన్ 30న జనరేట్ అయితే, మీకు 25 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. అంటే మీరు జులై 25లోపు ఎలాంటి వడ్డీలు, ఛార్జీలు లేకుండా మీ బకాయి మొత్తాన్ని తీర్చేయవచ్చు. ఒక వేళ మీరు మినిమం అమౌంట్‌నే చెల్లిస్తే, మిగతా సొమ్ముకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
బిల్లింగ్ సైకిల్
గ్రేస్ పీరియడ్ అనేది క్రెడిట్ కార్డ్‌లను బట్టి మారుతుంది. చాలా క్రెడిట్ కార్డు సంస్థలు 20-60 రోజుల వరకు గ్రేస్ పీరియడ్‌ను ఇస్తున్నాయి. బిల్లింగ్ సైకిల్ అనేది వరుసగా రెండు బిల్లు స్టేట్మెంట్ల మధ్య ఉన్న కాలం. సాధారణంగా బిల్లింగ్ సైకిల్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది. ఆ 30 రోజులలో చేసిన లావాదేవీలన్నీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో ప్రతిబింబిస్తాయి. ఈ స్టేట్మెంట్లో కార్డు వినియోగదారుడు బకాయి ఉన్న బ్యాలెన్స్, బకాయి ఉన్న కనీస మొత్తం, చెల్లింపు గడువు తేదీ ఉంటుంది. గ్రేస్ పీరియడ్‌లో యూజర్లు బకాయి ఉన్న మొత్తం బ్యాలెన్స్ లేదా బకాయి ఉన్న కనీస మొత్తాన్ని వడ్డీలు, అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా గడువు తేదీలోగా బకాయి చెల్లించకపోతే, ట్రాన్సాక్షన్ తేదీ నుంచి బకాయి మొత్తానికి వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.