Large Cap Vs Mid Cap Vs Small Cap Funds :చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. కానీ సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలో తెలియక ఇబ్బందిపడుతూ ఉంటారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ), రిస్క్‌ల ఆధారంగా 3 రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అవి: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
Large Cap Mutual Funds :కంపెనీలను వర్గీకరించడానికి 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) కొన్ని ప్రమాణాలను పాటిస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన టాప్-100 కంపెనీలను లార్జ్ క్యాప్ కంపెనీలుగా పేర్కొంటారు. ఈ కంపెనీల మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని బ్లూ-చిప్ స్టాక్స్ అని కూడా అంటారు. వాస్తవానికి ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు రిలయన్స్, ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్ మొదలైన కంపెనీలు. ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్లను 'లార్జ్ క్యాప్ ఫండ్స్' అంటారు. వీటిలో పెట్టిన పెట్టుబడులకు రిస్క్ తక్కువగా ఉంటుంది.
మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
Mid Cap Mutual Funds :మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టాప్-101 నుంచి 250 కంపెనీలను మిడ్ క్యాప్ కంపెనీలు అంటారు. ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.5,000 కోట్లు నుంచి రూ.20,000 కోట్ల వరకు ఉంటుంది. ఉదాహరణకు వోల్టాస్, సుజ్లాన్ ఎనర్జీ, గోద్రెజ్ ఇండస్ట్రీస్ మొదలైన కంపెనీలు. ఇలాంటి మిడ్-క్యాప్ షేర్స్‌లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్లను 'మిడ్-క్యాప్ ఫండ్స్' అని అంటారు. వాస్తవానికి మిడ్-క్యాప్ కంపెనీలకు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంటుంది. అయితే, లార్జ్ క్యాప్ ఫండ్లతో పోలిస్తే, మిడ్ క్యాప్ ఫండ్లలో కాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
Small Cap Mutual Funds :మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 250 తరువాత ఉండే కంపెనీలు అన్నీ స్మాల్ క్యాప్ స్టాక్స్‌గా పరిగణించబడతాయి. వాస్తవానికి ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5000 కోట్లలోపే ఉంటుంది. ఇలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్లను స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. వాస్తవానికి చాలా స్మాల్ క్యాప్ కంపెనీలకు పెద్దగా ట్రాక్ రికార్డ్ ఉండదు. ఉదాహరణకు స్టార్టప్ కంపెనీలు లేదా ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న కంపెనీలు స్మాల్ క్యాప్ స్టాక్స్ కిందకు వస్తాయి. కనుక వీటిలో పెట్టే పెట్టుబడులకు రిస్క్ ఎక్కువగానే ఉంటుంది.
లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ల మధ్య ఉండే వ్యత్యాసాలు
1. Large Cap Mutual Funds :
- రిస్క్ ప్రొఫైల్ :లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ రిస్క్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటాయి. ఇవి టాప్ 50-100 కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి.
- లిక్విడిటీ, అస్థిరత :ఈ లార్జ్ క్యాప్ ఫండ్లు మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకోగలుగుతాయి. స్వల్పకాలంలో చిన్నచిన్న నష్టాలు వచ్చినా, దీర్ఘకాలంలో మంచి రాబడులను అందించగలుగుతాయి. ఇవి లిక్విడిటీని కలిగి ఉంటాయి. అంటే అత్యవసరమైనప్పుడు వీటిని అమ్మేసి, డబ్బులు చేసుకోవచ్చు.
- రాబడి (డైరెక్ట్ ప్లాన్స్) :గత 10 ఏళ్లలో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ల సగటు వార్షిక రాబడి 13 -15 శాతం మధ్య ఉంది.