Gratuity Rules :ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమకు చెందాల్సిన బెనిఫిట్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఉద్యోగులకు నెలవారీ జీతంతోపాటు, ప్రావిడెంట్ ఫండ్, డియర్నెస్ అలవెన్స్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్సహా కొన్ని ఎర్నెడ్ లీవ్స్ ఉంటాయి. మహిళలు అయితే ప్రత్యేకంగా మెటర్నిటీ సెలవులు కూడా ఇస్తారు. ఈ బెనిఫిట్స్‌లో అత్యంత ముఖ్యమైనది గ్రాట్యుటీ. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గ్రాట్యుటీ ఎవరికి వస్తుంది?
Gratuity Eligibility : ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఉద్యోగులు ఒక సంస్థలో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే, వారు గ్రాట్యుటీ పొందేందుకు అర్హులు అవుతారు. వాస్తవానికి మీరు కొత్త కంపెనీలో చేరిన ప్రతిసారీ, మీ కాస్ట్-టు-కంపెనీ (సీటీసీ)లో కొంత భాగం గ్రాట్యుటీకి జమ అవుతుంది. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం-1972 ప్రకారం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అందరూ గ్రాట్యుటీ పొందడానికి అర్హులు అవుతారు. గ్రాట్యుటీ పొందే విషయంలో వీరి మధ్య ఎలాంటి భేదం ఉండదు.
చాలా కంపెనీలు 62 ఏళ్ల వయస్సులో రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించడంలేదు. దీనితో ఇటీవల అలహాబాద్ హైకోర్టు 'గ్రాట్యుటీ' చెల్లింపునకు సంబంధించి కీలకమైన తీర్పును వెలువరించింది. దీని ప్రకారం, ఏ ఉద్యోగి అయినా తనకు నచ్చిన (60 లేదా 62 ఏళ్ల) వయస్సులో పదవీ విరమణ చేయవచ్చు. వారికి కంపెనీలు కచ్చితంగా గ్రాట్యుటీ చెల్లించాల్సిందే.
పేమెంట్ అండ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం, దేశంలోని అన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలు, గనులు, చమురు క్షేత్రాలు, ఓడరేవులు, రైల్వేలు తమ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాల్సిందే. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఒక కంపెనీ లేదా షాపులో 10 లేదా అంత కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్లు గ్రాట్యుటీ ప్రయోజనం పొందడానికి అర్హులు అవుతారు.
గ్రాట్యుటీ ఎంత వస్తుంది?
Gratuity Percentage : పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్-1972 ప్రకారం, ఒక ఉద్యోగి బేసిక్ సాలరీలో 4.81 శాతాన్ని గ్రాట్యుటీ కింద ఇస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి సంవత్సరానికి రూ.5,00,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు అయితే, అతను 4.81 శాతం గ్రాట్యుటీకి అర్హుడు అవుతాడు. అప్పుడు అతనికి మొత్తంగా రూ.24,050 గ్రాట్యుటీగా అందుతుంది. అంటే సదరు ఉద్యోగి నెలకు దాదాపు రూ.2,000 వరకు గ్రాట్యూటీ పొందినట్లు లెక్క.
గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు?
How To Calculate Gratuity : ఉద్యోగి జీతం, డియర్నెస్ అలవెన్స్ (DA) ఆధారంగా గ్రాట్యుటీ లెక్కిస్తారు. వాస్తవానికి ఉద్యోగి సంపాదించిన గ్రాట్యుటీ మొత్తం, అతని సర్వీస్ కాలం, చివరిసారిగా వచ్చిన జీతం ఆధారంగా నిర్ధరణ అవుతుంది. గ్రాట్యుటీ చట్టం-1972 పరిధిలోకి వచ్చే కంపెనీలు నెలకు 26 రోజులుగా పరిగణించి గ్రాట్యుటీని లెక్కించాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగి సంవత్సరం పాటు కంపెనీలో పనిచేస్తే, అతనికి 15 రోజులకు ఒకసారి చొప్పున గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది.