What Happens To Loan Defaulters :అత్యవసరంగా డబ్బు కావాలి ఎలా? అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా మందికి గుర్తుకు వచ్చేది వ్యక్తిగత రుణం. బ్యాంకులు ముందస్తు ఆమోదంతో ఆఫర్ చేస్తుండడం, ఆన్లైన్లో తక్కువ సమయంలోనే ఆమోదించడం, హామీ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం - ఇటువంటి అనుకూలతలు ఉండడం వల్ల చాలా మంది పర్సనల్ లోన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (Non Banking Financial Companies) గతంలో కంటే ఇప్పుడు చాలా విరివిగా పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. సకాలంలో రుణాలు తీర్చేసేవారికి, తక్కువ వడ్డీతో మళ్లీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి. ఒకవేళ రుణం ఎగవేస్తే, డిఫాల్టర్లపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. అందుకే వ్యక్తిగత రుణాలు తీసుకోవాలని అనుకునేవారు, డిఫాల్టర్లపై బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో ముందే తెలుసుకోవడం మంచిది.
నోటీసులు పంపిస్తాయి
రుణగ్రహీత లోన్ సొమ్మును తిరిగి చెల్లించకపోతే రుణదాతలు ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిల్, ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తారు. లోన్ కట్టాల్సిన గడువు ముగిసిన తర్వాతే ఈ రిమైండర్లను పంపుతారు. రుణగ్రహీత లోన్ డీఫాల్ట్‌గా మారినప్పుడు బ్యాంకులు అధికారిక నోటీసులను పంపిస్తాయి. తదుపరి చర్య తీసుకోకుండా రుణగ్రహీత బకాయిలను తీర్చడానికి ఇదే చివరి అవకాశం అవుతుంది.
అఖరి అవకాశం ఇదే!
పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో చివరి ప్రయత్నంగా ఉపయోగపడేదే రుణ పునర్నిర్మాణం. బ్యాంకుతో అప్పటి వరకు ఉన్న నిబంధనలు మార్చడం అన్నమాట. ఇప్పటికే ఉన్న చెల్లింపు వ్యవధి, వాయిదా మొత్తం ఇలా అన్నింటినీ కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకురావడంగా చెప్పొచ్చు. రుణ దాతలు చివరి ప్రయత్నంగా లోన్ సొమ్మును రికవరీ చేయడానికి రుణ గ్రహీతపై చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తాయి. రుణగ్రహీత ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, వేలం వేసే అవకాశం కూడా ఉంది. చాలా రుణసంస్థలు లోన్ తీసుకున్నవారికి చెల్లింపు గడువు తేదీ తర్వాత 30-90 రోజుల గ్రేస్ పీరియడ్ ను ఇస్తాయి. ఈ వ్యవధిలో రుణ గ్రహీత లోన్‌ను కట్టేయొచ్చు.