What Happens To an Aadhaar Card After A Person's Death : ఆధార్ భారతీయ పౌరులకు ఒక ప్రాథమిక గుర్తింపు కార్డుగా మారింది. ఈ ఆధార్ ఒక 12 అంకెల యూనిక్ నంబర్. దీనిలో మీ పేరు, చిరునామా, ఫింగర్‌ప్రింట్, ఐరిస్ లాంటి చాలా సున్నితమైన సమాచారం ఉంటుంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వరకు ప్రతిదానికీ ఈ ఆధార్ ఉండాలి. పిల్లలకు కూడా ఆధార్ కార్డు తీసుకునే అవకాశం ఉంది. అయితే నేడు ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో సైబర్ నేరగాళ్లకు, మీ ఆధార్ కార్డ్ దొరికితే, దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీ ఆధార్ కార్డ్ వివరాలు ఇతరులకు చిక్కకుండా చూసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తి మరణిస్తే, అతని లేదా ఆమె ఆధార్ కార్డు ఏమవుతుంది? అది చెల్లుబాటు అవుతుందా? లేదా ఆ ఆధార్‌ను సరెండర్ చేయాలా? లేక క్లోజ్ చేయాలా? అనే పలు అనుమానాలు వస్తాయి. అందుకే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చనిపోయిన వ్యక్తి ఆధార్‌ను ఏం చేయాలి?
ఆధార్ కార్డును జారీ చేసే వ్యవస్థను యూఐడీఏఐ రూపొందించింది. ప్రతి భారతీయుడికి ఈ యూఐడీఏఐ ద్వారానే ఆధార్ కార్డ్ జారీ అవుతుంది. అయితే ఆధార్‌ను సరెండర్ చేయడానికి లేదా క్యాన్సిల్ చేయడానికి ఎలాంటి వ్యవస్థ అందుబాటులో లేదు. అయితే దీని భద్రతను సంబంధించి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం చేసింది.
ఆధార్ కార్డును సరెండర్ చేయడం లేదా క్యాన్సిల్ చేయడం సాధ్యం కాదు. కానీ దానిని లాక్ చేయవచ్చు. లాక్ చేసిన తర్వాత సదరు ఆధార్ డేటాను ఇతర వ్యక్తులు యాక్సెస్ చేయలేరు. ఒకవేళ సదరు ఆధార్‌ను ఉపయోగించాలంటే, కచ్చితంగా దానిని అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా అన్‌లాక్ చేసే అవకాశం మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటుంది.