Health Insurance Top Up Plans Benefits : వైద్య రంగంలో చికిత్సల ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. బీమా ప్రీమియం రేట్లు సామాన్యుడిని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పుడిప్పుడే వైద్య ఖర్చుల కోసం బీమా పాలసీల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రాథమిక పాలసీని తీసుకుంటున్నారు. అలాంటివారు ఉన్న పాలసీకే టాపప్ చేయించడం వల్ల కొంత భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. టాపప్‌ను ఎంచుకునేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
టాపప్ పాలసీలు ఎందుకంటే?
ఆరోగ్య బీమా పరిమితికి మించి అదనంగా ఖర్చయినప్పుడు, టాపప్ పాలసీలు ఆ అధిక మొత్తాన్ని చెల్లిస్తాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆరోగ్య బీమా రక్షణ పొందాలనుకున్నప్పుడు టాపప్ పాలసీలు ఎంచుకోవాల్సి ఉంటుంది.
అప్పుడే స్పష్టత వస్తోంది
టాపప్ పాలసీని ఎంచుకోవాల్సినప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న ప్రాథమిక పాలసీ ఎంత విలువ చేస్తుందో చూసుకోవాలి. దాని ఉన్న నిబంధనలూ చూసుకోండి. పాలసీ తగ్గింపులు, ఇతర చెల్లింపులు, పరిమితుల్లాంటివి స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడే టాపప్ పాలసీని ఎంచుకునేటప్పుడు ఏయే ఖర్చులకు వర్తించేలా తీసుకోవచ్చనే విషయమై స్పష్టత వస్తుంది.
మీ పాలసీని బట్టి టాపప్
మీ ప్రాథమిక పాలసీ కనీసం రూ.5లక్షల మేరకు ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాతే టాపప్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఈ పాలసీలు ఎలాంటి పరిమితి లేకుండా ఎంచుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఎంత మేరకు ప్రీమియం చెల్లించడానికి ఇబ్బంది ఉండదో చూసుకోండి. దాన్ని బట్టి, టాపప్ చేయండి.