తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ సంకేతాలు కనిపిస్తే - మీ కారు బ్రేక్స్ ఫెయిల్ కాబోతున్నట్టే! - Most Common Signs of Brake Failure

Signs of Brakes Failure : కారు బ్రేకులు ఫెయిల్ అయితే ఏం జరుగుతుందో తెలిసిందే. అయితే.. కొన్ని వాహనాలకు బ్రేకులు ఉన్నట్టుండి ఫెయిల్ అవుతాయి. మరి.. ఎలాంటి సంకేతాలు లేకుండానే ఇలా జరుగుతుందా అంటే.. కాదు అంటున్నారు నిపుణులు. బ్రేక్ సిస్టమ్ ఫెయిల్ కావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని.. అప్పుడు వెంటనే అలర్ట్ కావాలని సూచిస్తున్నారు!

Brakes
Brakes Failure

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 2:17 PM IST

Warning Signs of Brakes Failure : అనుకోకుండా సంభవించే బ్రేక్స్​ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్​ వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. విలువైన ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే.. బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని వాహనం ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలు పంపిస్తుందని.. వాటిని పసిగట్టి అలర్ట్ కావొచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గీసుకుంటున్న శబ్దం :మీరు కారు(Car) నడుపుతున్నప్పుడు గీసుకుంటున్న లేదా రాసుకుంటున్న శబ్దం వస్తే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే అది బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని తెలిపే సంకేతం కావొచ్చు. మీ వాహనంలో ఇలాంటి శబ్దం వస్తే వెంటనే మెకానిక్​ను సంప్రదించి రిపేర్ చేయించుకోవడం బెటర్ అంటున్నారు.

గరగరమనే శబ్ధం :వాహనంలో బ్రేకులు ఫెయిల్ కాబోతున్నాయని తెలిపే మరో హెచ్చరిక సంకేతం గరగరమనే శబ్దం రావడం. సాధారణంగా మనం బ్రేకులను నొక్కినప్పుడు వీల్స్ వద్ద ఉన్న బ్రేక్ షూ డ్రమ్​ను గట్టిగా పట్టి ఉంచుతుంది. ఈ పార్ట్స్ మధ్య బ్రేక్ లైనింగ్ ఉంటుంది. ముఖ్యంగా మనం ఎక్కువకాలం బ్రేక్ లైనింగ్​లు మార్చకుండా వాడుతున్నట్టయితే అవి అరిగిపోయి బ్రేక్​ షూ డ్రమ్​తో రాపిడికి గురవుతాయి. ఫలితంగా.. గరగరమనే శబ్దం వస్తుంది. అయినా అలానే వాడితే బ్రేక్ షూ డ్రమ్ కూడా అరిగి బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.

వైబ్రేషన్స్ :మీరు వాహనం నడుపుతున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని ముందుగానే గుర్తించడానికి ఈ సంకేతం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే.. ఈ వైబ్రేషన్స్ రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి.. బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ పెడల్ వైబ్రేట్​ అయినట్టు గమనిస్తే అప్పుడు మీ వాహనం బ్రేకులలో సమస్య తలెత్తినట్లుగా గుర్తించాలి.

మరొకటి.. మీరు బ్రేక్స్ అప్లై చేసినప్పుడు వాహనం మొత్తం వైబ్రేషన్స్ రావడం గమనిస్తే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లే. ఇలా ఎందుకు వస్తాయంటే.. మీరు ఎక్కువకాలం బ్రేకులు మార్చకుండా ఉండడం, వాటిల్లో అరుగుదల ఎక్కువగా ఉండటమే కారణం. ముఖ్యంగా పరిమిత వేగం తర్వాత ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నట్లయితే వెంటనే మెకానిక్​ను సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.

మీ కారు ఇచ్చే ఈ సిగ్నల్స్‌ చూస్తున్నారా? - లేకపోతే ఇంజిన్‌ ఖతం!

బ్రేక్ పెడల్ లోతుగా నొక్కడం :చాలా మంది అధిక వేగంతో వెళుతున్నప్పుడు ఒక్కసారిగా ఏదైనా అడ్డు వస్తే.. వాహనం వేగాన్ని పూర్తిగా తగ్గించడానికి బ్రేక్ పెడల్స్​ను డీప్​గా నొక్కుతుంటారు. అయితే, ఇది కూడా బ్రేకులు ఫెయిల్ కావడానికి దారి తీస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే తరచుగా ఇలా చేయడం వల్ల బ్రేక్ ఆయిల్ లీకేజీకి కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ వాహనం బ్రేక్ ఆయిల్​ లీకేజీ అవుతుందా లేదా అని తరుచుగా చెక్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.

బ్రేక్ వార్నింగ్ లైట్ వెలగడం : ఇటీవల కాలంలో వస్తున్న కార్లలో సరికొత్త టెక్నాలజీ కలిగిన భద్రతా ఫీచర్లు ఉంటున్నాయి. అందులో ఒకటి బ్రేక్ వార్నింగ్ లైట్ ఫీచర్. కారులో ఒకవైపు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) ఉంటే.. ఇంకో వైపు బ్రేక్ సిస్టమ్ వార్నింగ్ లైట్లు ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే.. డ్రైవింగ్​లో ఉన్నప్పుడు బ్రేక్ నొక్కితే ఏబీఎస్ సిస్టమ్ యాక్టివేటై ఏబీఎస్ లైట్ వెలుగుతుంది. అదే బ్రేకింగ్, ఏబీఎస్ సిస్టమ్ పనితీరులో ఏదైనా లోపం ఉంటే బ్రేక్ వార్నింగ్ లైట్లు వెలుగుతాయనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు పైన పేర్కాన్న సంకేతాలు గమనిస్తే వెంటనే అలర్ట్ అయి మెకానిక్​ను సంప్రదించాలని.. తద్వారా బ్రేక్ ఫెయిల్యూర్ ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

కారు కొనుగోలు చేస్తున్నారా? - ఈ సేఫ్టీ ఫీచర్స్ తప్పకుండా ఉండేలా చూసుకోండి!

ABOUT THE AUTHOR

...view details