Vehicle Insurance Add on Benefits :వెహికల్ రోడ్డు మీదకు రావాలంటే బీమా తప్పనిసరి. ప్రమాదం లేదా ఏవైనా ఇతర కారణాలతో వాహనం దెబ్బతిన్నప్పుడు యజమానికి ఆర్థిక భారం కాకుండా ఇది కాపాడుతుంది. అంటే థర్డ్ పార్టీ వారికి జరిగిన నష్టానికి పరిహారాన్ని ఇస్తుంది. కారు బీమా నుంచి మరింత అదనపు రక్షణ పొందేందుకు వీలుగా పలు అనుబంధ పాలసీలనూ ఇప్పుడు బీమా సంస్థలు అందిస్తున్నాయి. వీటిని యాడ్-ఆన్‌లుగా పిలుస్తుంటారు. వీటిని తీసుకోవాలా? వద్దా? అనేది పూర్తిగా పాలసీదారుల ఇష్టమే. ఈ వెహికిల్ పాలసీల గురించి మరిన్ని వివరాలు మీ కోసం.
ప్రామాణిక పాలసీలో వాహనం డ్యామేజ్ అయినప్పుడు, థర్డ్‌పార్టీకి నష్టం వాటిల్లినప్పుడు బీమా సంస్థలు పరిహారాన్ని ఇస్తాయి. ఆనుబంధ పాలసీలు ఈ ప్రామాణిక పాలసీని మరింత బలోపేతం చేస్తాయి. ఇవి సాధారణ పాలసీ పరిధిలో ఉండే అంశాలకు మాత్రమే కాకుండా, ఇతర నష్టాలకూ బీమా రక్షణను అందిస్తాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం.
జీరో డిప్రిసియేషన్
ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పుడు రిపేర్ చేయించడానికిి అయ్యే ఖర్చును ఎలాంటి తగ్గింపు లేకుండా అందించేది 'జీరో డిప్రిసియేషన్'. ఇది క్లెయిం మొత్తాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. సాధారణ వాహన బీమా పాలసీ ఉంటే తరుగుదల విలువను అంచనా వేసి, ఆ మేరకు మాత్రమే పరిహారం అందిస్తారు. అదే మీరు యాడ్-ఆన్ పాలసీలను తీసుకోవడం వల్ల పూర్తి మొత్తాన్ని పొందేందుకు వీలవుతుంది. సాధారణంగా ఈ పాలసీని కారు కొన్న అయిదేళ్లపాటు తీసుకునేందుకు అవకాశముంటుంది.
ఇంజిన్‌కు రక్షణగా
కారు ఇంజిన్, దాని విడి భాగాలు వరదలు లేదా ఆయిల్ లీక్ లాంటి ఏవైనా కారణాల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. దీనికి సాధారణ పాలసీలో ఎలాంటి రక్షణా ఉండదు. 'ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్' తీసుకోవడం వల్ల ఇంజిన్‌కు జరిగిన నష్టానికి పరిహారం పొందవచ్చు. ముఖ్యంగా ఖరీదైన కార్లకు ఈ అనుబంధ పాలసీని తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే వరదల వల్ల ప్రభావితం అయ్యే ప్రాంతాల్లో ఉండేవారు కూడా దీన్ని తీసుకోవడం మంచిది. దీన్ని ప్రాథమిక పాలసీకి జోడించుకోవడం ద్వారా ఇంజిన్‌లో ముఖ్యమైన విడి భాగాలకూ బీమా రక్షణ లభిస్తుంది.
'రిటర్న్-టు-ఇన్వాయిస్'
ప్రమాదం వల్ల వాహనం పనికిరాకుండా పోవడం, చోరీ జరిగిన సందర్భాల్లో ప్రామాణిక పాలసీ వాహన బీమా విలువ (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ)ను మాత్రమే యజమానికి చెల్లిస్తుంది. దీనివల్ల వాహన యజమానికి అధిక నష్టం వస్తుంది. 'రిటర్న్-టు-ఇన్వాయిస్' యాడ్-ఆన్ ఎంచుకున్నప్పుడు పైన తెలిపిన పరిస్థితుల్లో వాహనం ఇన్వాయిస్ ధరను యజమానికి చెల్లిస్తుంది. ఇందులో రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా కలిసి ఉంటాయి. అంటే, కొత్త వెహికిల్ తీసుకునేందుకు అవసరమైన మొత్తాన్ని ప్రాథమిక పాలసీకి జోడించిన ఈ యాడ్-ఆన్ ద్వారా పొందవచ్చన్నమాట.