Union Interim Budget 2024 :ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో అంగన్వాడీలకు, ఆశావర్కర్లకు కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు అందిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఇప్పటి వరకు రూ.5 లక్షల బీమా కవరేజీని అందిస్తోంది. అయితే దీనిని రూ.10 లక్షల వరకు పెంచుతారని అందరూ భావించారు. కానీ నిర్మలా సీతారామన్ ఆ ఊసే ఎత్తలేదు. ఇది పేదలందరినీ తీవ్ర నిరాశకు గురిచేసింది.
మహిళలు లక్షాధికారులు అయ్యారు!
83 లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా 9 కోట్ల మంది మహిళలు ఆర్థికంగా ఉన్నతి సాధించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికే ఒక కోటి మంది లక్షాధికారులుగా తయారయ్యారని పేర్కొన్నారు. మరో 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది మహిళలు లక్షాధికారులు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
గృహ నిర్మాణం
మధ్యతరగతి ప్రజల కోసం నూతన గృహ నిర్మాణ విధానం అందుబాటులోకి తెస్తున్నామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. మురికివాడలు, అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇళ్లు కట్టుకోవడానికి, ఇళ్లు కొనుగోలు చేయడానికి మోదీ ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద రానున్న ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెప్పారు.
సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన 'పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్' కొవిడ్ 19 సంక్షోభ కాలంలోనూ కొనసాగిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.