Union Budget 2024 India : సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తాత్కాలిక బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టబోతోంది. మూడోసారి అధికారం చేపట్టాలన్న ఆకాంక్షల మధ్య ఈ బడ్జెట్ తీసుకొస్తోంది. ఈసారి బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలు ఉండకపోవచ్చంటూ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని రోజుల ముందు కీలక ప్రకటన చేశారు. తాత్కాలిక బడ్జెట్ కాబట్టి పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు.
షెడ్యూల్ ఇలా!
ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అరుదైన ఘనత సాధించనున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు నిర్మల. ఆ తర్వాత 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకోనున్నారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్.
ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్
సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. గతేడాది మాదిరిగా ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివి వినిపించనున్నారు నిర్మల. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అందులోని సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేందుకు యూనియన్ బడ్జెట్ అనే వెబ్‌సైట్‌తో పాటు, యాప్‌ను కేంద్రం తీసుకొచ్చింది.