Business Loan Schemes For Women : మన దేశంలో వ్యాపారం చేసే మహిళల కోసం కొన్ని వ్యాపార రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మహిళలు తమ వ్యాపారాల కోసం రుణాలను పొందొచ్చు. ఆర్థిక వృద్ధిని అందుకోవచ్చు. వనితలను వ్యాపార రంగంలో సశక్తులుగా తీర్చిదిద్దడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యం. అందుకే ఈ కథనంలో టాప్-5 బిజినెస్ లోన్ స్కీంల గురించి తెలుసుకుందాం.
వ్యక్తిగత రుణాలు Vs వ్యాపార రుణాలు
వ్యక్తిగత రుణాలకు, వ్యాపార రుణాలకు చాలా తేడా ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్ సంస్థల నుంచి వ్యక్తిగత రుణాలను పొందొచ్చు. దరఖాస్తు చేసిన వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఇతర అంశాల ఆధారంగా పర్సనల్ లోన్స్‌ను మంజూరు చేస్తారు. వ్యక్తిగత రుణాలకు పూచీకత్తు కావాలి. ఈ రుణాల ద్వారా పొందే నిధులతో మనకు ఇప్పటికే ఉన్న అప్పులను తీర్చేయొచ్చు. వైద్య వ్యయాల కోసం ఆ డబ్బును వాడుకోవచ్చు. ఇంటి పునర్నిర్మాణ పనుల కోసం ఆ నిధులను వినియోగించవచ్చు. వాటితో ఇంట్లో వినియోగించే ఉపకరణాలను కొనేయొచ్చు. వ్యాపార రుణం ద్వారా వచ్చే డబ్బును కేవలం వ్యాపారం కోసమే వెచ్చించాలి. వ్యాపార విస్తరణ, యంత్రాల కొనుగోలు, ముడిసరుకుల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ వ్యయాలకు రుణం డబ్బులను కేటాయించవచ్చు.
మహిళల కోసం ఉన్న టాప్ -5 బిజినెస్ లోన్ స్కీమ్స్ ఇవే!
- ముద్రా యోజన
- స్టాండప్ ఇండియా ప్రోగ్రాం
- మహిళా కాయిర్ యోజన
- ఉద్యమ్ శక్తి పోర్టల్
- క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్
1. ముద్రా యోజన :సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారాలు చేసే మహిళలకుముద్రా యోజన రుణాలను మంజూరు చేస్తారు. మహిళలు యజమానులుగా ఉన్న సంస్థలకు పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల దాకా రుణాన్ని ఇస్తారు. దీనిపై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా వ్యాపార విస్తరణ చేసుకుంటూ, రుణాన్ని సులభంగా తీర్చేయొచ్చు.
2. స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ :స్వయం ఉపాధి పొందే మహిళలకు స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి దాకా రుణాలను మంజూరు చేస్తారు. ఈ రుణాల మంజూరులో అణగారిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో బ్యాంకు బ్రాంచీ పరిధిలో కనీసం ఒక ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన మహిళా వ్యాపారికి ఈ రుణాన్ని ఇస్తుంటారు. గ్రీన్ ఫీల్డ్ వ్యాపారాల్లో ట్రేడింగ్, తయారీతో పాటు సేవా రంగాల్లో పనిచేసే మహిళా వ్యాపారులు స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా లబ్ధి పొందొచ్చు.