Real Estate Investing Strategies : ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అందరూ కొత్తకొత్త ఇళ్లను కొంటుంటే, దాదాపు 200 పాత ఇళ్లు, నిరుపయోగంగా వదిలేసిన ఇళ్లను కొన్నారు. వాటికి సాధ్యమైనంత తక్కువ ఖర్చులో మరమ్మతులు చేయించి, అద్దెలకు ఇచ్చి ప్రస్తుతం ఏటా రూ.8.2 కోట్ల దాకా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వ్యక్తిగతంగా పొదుపు చేసుకున్న డబ్బులు, బ్యాంకు రుణాలు, ఇళ్ల అద్దెల ద్వారా వచ్చిన ఆదాయంతోనే అద్దె ఇళ్ల వ్యాపార సామ్రాజ్యాన్ని హయతో కవమురా(Hayato Kawamura) నిర్మించుకున్నారు. 38 ఏళ్ల ఈ జపాన్ యువకుడి విజయగాథలోని విశేషాలను తెలుసుకుందాం.
జేబులో డబ్బులు లేకున్నా - ఇళ్ల ధరలపై ఆరా
హయతో కవమురా జపాన్‌లోని ఒసాకా నగర వాస్తవ్యులు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి సూత్రాలకు పూర్తి భిన్నంగా ఆయన ముందుకు సాగారు. అయినా ఆకర్షణీయమైన ఫలితాలను సాధించారు. లాభాలను మూట కట్టుకున్నారు. వాస్తవానికి హయతో కవమురాకు స్థిరాస్తి కంటే ఆర్కిటెక్చర్ (భవన నిర్మాణం) అంటేనే ఎక్కువ ఆసక్తి. ఆయన సొంతూరిలో ఉన్నప్పుడు పర్వతంపైకి ఎక్కి, ఊరిలోని ఏ భవనం నిర్మాణ స్వరూపం ఎలా భిన్నంగా ఉందనేది నిశితంగా పరిశీలిస్తూ కూర్చునేవారు. ఈ ఆసక్తే కాలక్రమంలో ఆయనను స్థిరాస్తి రంగం వైపుగా నడిపించింది. చివరకు గర్ల్ ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉన్న సమయంలోనూ హయతో కవమురా పాత ఇళ్లు, నిరుపయోగంగా వదిలేసిన ఇళ్లను పరిశీలిస్తుండేవారు. తన జేబులో డబ్బులు లేకున్నా, ఆ ఇళ్ల ధరల గురించి ఆరా తీస్తుండేవారు.
డిమోషన్ ఎఫెక్ట్
అప్పటివరకు హయతో కవమురా చిన్నపాటి ఉద్యోగం చేసేవారు. ఆ కంపెనీలో హయతోకు బాస్‌గా వ్యవహరించే ఒక వ్యక్తికి డిమోషన్ ఇచ్చారు. సీనియర్‌తో విబేధాల వల్లే తన బాస్‌కు డిమోషన్ ఇచ్చారని తెలుసుకొని హయతో చాలా బాధపడ్డాడు. "ఉద్యోగి సామర్థ్యం కంటే, సీనియర్ల మెప్పు ఉన్న వాళ్లకే ప్రమోషన్లు ఇస్తున్నారని నేను ఆ సమయంలో గ్రహించాను. ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాను. వేతనంతో సంబంధం లేకుండా జీవించే స్థాయికి ఎదగాలని నిర్దేశించుకున్నాను" అని నాటి పరిస్థితిని హయతో గుర్తు చేసుకున్నారు.
రూ.10 లక్షలతో బోణీ కొట్టి
23 ఏళ్ల వయసులోనే హయతో కవమురా స్థిరాస్తి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. వేలంపాటలో పాల్గొని రూ.10.1 లక్షలకు ఒక ఫ్లాట్‌ను కొన్నారు. దాని ద్వారా ఏటా రూ.2 లక్షల దాకా అద్దె ఆదాయాన్ని ఆర్జించారు. ఆరేళ్ల తర్వాత దాన్ని రూ.25.6 లక్షలకు అమ్మేసి, లాభాలను తీసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే పాత ఇళ్లు, నిరుపయోగంగా వదిలేసిన ఇళ్లను కొనే విషయంలో పెద్దగా పోటీలేదని హయతో గుర్తించారు. ఆ విభాగంపై మాత్రమే ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నారు. రూ.6 లక్షలలోపు రేటుకు దొరికే పాత ఇళ్లను కొనాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాంటి ఇళ్లను కొని సాధ్యమైనంత తక్కువ ఖర్చులో మరమ్మతులు చేయించి అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో బలమైన సంబంధాలు ఉండటంతో, తక్కువ రేటు పాత ఇళ్లు ఎక్కడున్నా హయతో కవమురాకు వెంటనే కబురు పెట్టేవారు. దీంతో ఆయన స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా శరవేగంగా విస్తరించింది.
మెర్రీ హోం పేరుతో కంపెనీ
ఈ విజయాలు ఇచ్చిన విశ్వాసంతో 2018లో మెర్రీ హోం (Merryhome) పేరుతో ఒక స్థిరాస్తి కంపెనీని హయతో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఆయన దాదాపు 200కుపైగా పాత ఇళ్లను కొని అద్దెలకు ఇచ్చారు. వాటి ద్వారా ఏటా రూ.8.2 కోట్ల దాకా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. "రాత్రికి రాత్రి ధనవంతుడు అయిపోవాలని నేను ఎన్నడూ అనుకోలేదు. సహనం, దీర్ఘకాలిక ప్రణాళిక, నిశిత పరిశీలన వల్లే ఈ విజయం సాధ్యమైంది" అని హయతో తెలిపారు. ఇప్పుడు జపాన్‌లో స్థిరాస్తి వ్యాపారంలోకి వస్తున్న ఎంతో మంది కొత్తవారు ఈయన సక్సెస్ గురించి తెలుసుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-5 టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!
రియల్ ఎస్టేట్ స్కామ్స్ నుంచి సేఫ్‌గా ఉండాలా? ఈ టిప్స్ పాటించాల్సిందే!