Top 10 Post Office Schemes : మన కష్టార్జితంలో నుంచి కొంత భాగాన్ని తప్పకుండా పొదుపు చేసుకోవాలి. ఇలా పొదుపు చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కొంత భరోసాను, బాసటను అందిస్తుంది. అత్యవసరాలను తీరుస్తుంది. ప్రతినెలా తమ ఆదాయంలో నుంచి చిన్నపాటి మొత్తాలను పొదుపు చేయాలని భావించే వారి ఎదుట ప్రస్తుతం చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే అత్యధికులు కోరుకునేది మాత్రం, తక్కువ రిస్క్‌తో ఎక్కువ ప్రయోజనాన్ని అందించే పొదుపు పథకాలనే. ఈ రకానికి చెందిన టాప్-10 పోస్టాఫీస్ పొదుపు పథకాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
1. పోస్టాఫీస్ పొదుపు ఖాతా
పోస్టాఫీస్ పొదుపు ఖాతాను ఎవరైనా తెరవొచ్చు. ఈ ఖాతాలో రూ.500 కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాలి. ఇందులో జమచేసే డబ్బులపై 4 శాతం దాకా వడ్డీ వస్తుంది. ప్రతినెలా 10వ తేదీ నుంచి నెలాఖరు మధ్య ఉన్న అత్యల్ప నగదు బ్యాలెన్సు ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తారు. నెలవారీ పొదుపుల కోసం ఈ ఖాతా బాగా పనికొస్తుంది.
2. నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ (RD) ఖాతా
ప్రతినెలా కొంత మొత్తాన్ని తప్పకుండా పొదుపు చేయాలని భావించేవారు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ (RD) ఖాతాను పోస్టాఫీసులో తెరుచుకోవచ్చు. ప్రతినెలా కనిష్ఠంగా రూ.100 కూడా పొదుపు చేయొచ్చు. గరిష్ఠంగా ప్రతినెలా ఎంత మొత్తం పొదుపు చేయొచ్చు అనే దానికి ఎలాంటి పరిమితీ లేదు. రాబోయే కొన్నేళ్లలో నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేయాలనే లక్ష్యం ఉన్నవారికి ఈ ఖాతా ఉపయోగపడుతుంది. ఖాతాలోని డబ్బుపై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని లెక్కించి జమచేస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ ఆదాయం బాగానే లభిస్తుంది.
3. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్స్(TD)
నిర్దిష్టంగా కొన్నేళ్లు మాత్రమే డబ్బును పొదుపు చేయాలని భావించే వారికి బెస్ట్ ఆప్షన్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ (TD) ఖాతా. రూ.1000 చెల్లించి ఈ ఖాతాను పోస్టాఫీసులో తెరుచుకోవచ్చు. ఈక్రమంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల వ్యవధిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. మన అవసరాలు, ఆర్థిక సామర్థ్యాలకు సరిపోలే వ్యవధిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ ఖాతాలో జమయ్యే డబ్బుపై మంచి వడ్డీరేటు లభిస్తుంది. ఖాతా వ్యవధి ఎన్ని సంవత్సరాలు పెరిగితే, వడ్డీరేటు అంతగా పెరుగుతుంది. వడ్డీపై ఏటా చక్రవడ్డీ లభించడం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది.
4. నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్
తమ పొదుపుల నుంచి నెలవారీ ఆదాయాన్ని కోరుకునే వారికి ఉత్తమ ఆప్షన్ నేషనల్ సేవింగ్స్ నెలవారీ ఆదాయ ఖాతా. ఉద్యోగ విరమణ పొందినవారు, ప్రతినెలా నిలకడైన ఆదాయాన్ని కోరుకునేవారు పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. ఈ ఖాతాను ఒక వ్యక్తే తెరిస్తే, గరిష్ఠంగా రూ.9 లక్షల దాకా డిపాజిట్ చేయొచ్చు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉమ్మడి ఖాతాను తెరిస్తే, గరిష్ఠంగా రూ.15 లక్షల దాకా డిపాజిట్ చేయొచ్చు. ఈ మొత్తంపై ప్రతినెలా వడ్డీ ఆదాయాన్ని అందిస్తారు.