TCS CEO Salary : టీసీఎస్ కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కె. కృతివాసన్‌కు గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో అత్యధికంగా రూ.25.36 కోట్ల వార్షిక స్థూల వేతనం లభించింది. ఈ విషయాన్ని కంపెనీ గురువారం అధికారికంగా ప్రకటించింది. రాజేశ్ గోపీనాథన్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత 2023 జూన్‌లో టీసీఎస్ సీఈఓ పగ్గాలను ఐదేళ్ల కాలం కోసం కృతివాసన్ చేపట్టారు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, కృతివాసన్‌కు లభించిన మొత్తం రూ.25.36 కోట్ల స్థూల వేతనంలో రూ.1.27 కోట్ల నికర వేతనం, రూ. 3.08 కోట్ల ఇతర ప్రయోజనాలు, భత్యాలు, అలవెన్స్, రూ. 21 కోట్ల కమీషన్ ఉన్నాయి. టీసీఎస్‌కు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల గ్లోబల్ హెడ్ హోదాలో ఉండటం వల్ల అటువైపు నుంచి ఆకర్షణీయమైన కమీషన్ ఆదాయం కృతివాసన్‌కు లభించింది.
శాలరీలో దాగిన లెక్కలివీ
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఎన్జీ సుబ్రమణ్యం కూడా గత ఆర్థిక సంవత్సరంలో రూ.26.18 కోట్ల స్థూల వేతనాన్ని ఆర్జించారు. ఆయన త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. సుబ్రమణ్యం ఆర్జించిన మొత్తం రూ.26.18 కోట్ల స్థూల వేతనంలో రూ.1.72 కోట్ల నికర వేతనం, రూ.3.45 కోట్ల ఇతర ప్రయోజనాలు, భత్యాలు, అలవెన్సులు, రూ.21 కోట్ల కమీషన్ ఆదాయం ఉన్నాయి. సీఓఓ ఎన్జీ సుబ్రమణ్యం రెమ్యునరేషన్ గత సంవత్సరం వ్యవధిలో 8.2 శాతం మేర పెరిగిందని టీసీఎస్ వెల్లడించింది.
అయితే ఎన్జీ సుబ్రమణ్యం, కె. కృతివాసన్ సంపాదనలను పోల్చలేమని ఎందుకంటే వారిద్దరి హోదాల్లో తేడా ఉందని టీసీఎస్ స్పష్టం చేసింది. అంతకుముందు కంపెనీ సీఈఓగా సేవలందించిన రాజేశ్ గోపీనాథన్ కేవలం రెండు నెలల సర్వీసులో రూ. 33.6 లక్షల నికర జీతం, రూ. 76.8 లక్షలు ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు, భత్యాలను ఆర్జించారని వెల్లడించింది. 'టీసీఎస్ సీఓఓ వేతనం దాని ఉద్యోగుల మధ్యస్థ వేతనం కంటే 346.2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2024 మార్చి 31 నాటికి ఇది ప్రతినెలా రూ.6,01,546గా ఉంది' అని తెలిపింది. కంపెనీ మాజీ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.29.16 కోట్లు ఆర్జించారు. ఇది ప్రస్తుత సీఈఓ కృతివాసన్ వేతనం కంటే కొంచెం ఎక్కువే.