Stock Market Close :మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. దీనితో ఆరు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తున్నప్పటికీ, ఇండెక్స్ హెవీవెయిట్స్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, ఎం అండ్ ఎం రాణించడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 584 పాయింట్లు లాభపడి 81,634 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 217 పాయింట్లు వృద్ధిచెంది 25,013 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్
- నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్‌సెర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలివర్, ఐటీసీ, టీసీఎస్, పవర్‌గ్రిడ్
అంతర్జాతీయ మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో టోక్యో, హాంకాంగ్, సియోల్ నష్టాలతో ముగిశాయి. షాంఘై మాత్రమే లాభాలతో గట్టెక్కెంది. సోమవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 1.84 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 79.44 డాలర్లుగా ఉంది.