Stock Market Today March 12th 2024 :మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, టెక్ సెక్టార్లు రాణిస్తుండడం సహా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలపరుస్తోంది.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 388 పాయింట్లు లాభపడి 73,891 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 85 పాయింట్లు వృద్ధి చెంది 22,418 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ :ఐటీసీ, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ
Indigo Shares :
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ 'ఇండిగో' సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అయిన రాకేశ్ గంగ్వాల్, కంపెనీలోని తన షేర్ హోల్డింగ్‌ను భారీగా తగ్గించుకున్నారు. సోమవారం 5.83 శాతం వాటాను ఓపెన్ మార్కెట్లో అమ్మేశారు. దీని మొత్తం విలువ సుమారుగా రూ.6,785 కోట్లు ఉంటుంది.
విభేదాలే కారణం!
ఇండిగో కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో సహ వ్యవస్థాపకుడు రాహుల్ భాటియాతో రాకేశ్ గంగ్వాల్‌కు విభేదాలు వచ్చాయి. దీనితో కంపెనీలోని తన షేర్ హోల్డింగ్స్‌ను తగ్గించుకుంటానని ఫిబ్రవరిలోనే రాకేశ్ గంగ్వాల్ ప్రకటించారు.
బీఎస్ఈ బల్క్ డీల్ డేటా ప్రకారం, రాకేశ్ గంగ్వాల్ 2.25 కోట్ల షేర్లను మూడు విడతలుగా విక్రయించారు. వీటిని రూ.3,015.10 నుంచి రూ.3,016.36 ప్రైస్ రేంజ్లో అమ్మేశారు. వాస్తవానికి ఈ ఇండిగో షేర్ వాల్యూ బీఎస్ఈలో రూ.3,214.25గా ఉంది. కానీ రాకేశ్ వాటిని డిస్కౌంట్ ప్రైస్‌లోనే అమ్మేయడం గమనార్హం.