Stock Market Portfolio Management :స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది దీర్ఘకాలంలో ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఉన్న ఉత్తమ మార్గాల్లో ఒకటి. ఇందుకు గాను సరైన పోర్ట్ పోలియోను సృష్టించడం అతిముఖ్యమైనది. స్టాక్ పోర్ట్‌ఫోలియోను రూపొందించడానికి మీ లక్ష్యాలను నిర్ణయించడం మొదటి దశ. మీరు పోర్ట్‌ఫోలియో సృష్టించుకోవడానికి ప్రయత్నించే ముందు మీ అంతిమ లక్ష్యం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ ఇన్వెస్ట్మెంట్లు లక్ష్యాలకు చేరువ చేసే దిశగా పనిచేస్తాయని నిర్ధరించుకోవచ్చు.
ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వ్యక్తి అనుకుందాం. రాబోవు 10-15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే స్టాక్ పోర్ట్‌పోలియోను ఇప్పుడే సృష్టించుకోవడం అవసరం. లక్ష్యానికి రెండు లేదా మూడేళ్ల ముందు నుంచే క్రమంగా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకుంటూ ఉండడం ఉత్తమం.
పెట్టుబడుల విభజన
మీ లక్ష్యాలు ఏంటో నిర్ణయించుకున్న తర్వాత అందుకు అనుగుణంగా పెట్టుబడులను విభజించడం రెండో దశ. ఈ దశలో మీ రిస్క్ ప్రొఫైల్‌ను సరిగా అంచనా వేయడం చాలా కీలకం. ఇది మరింత సమాచారంతో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకున్నారు అనుకుందాం. అంటే మీరు రిస్క్ మధ్యస్థంగా ఉన్న షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. మిడ్ కాప్, స్మాల్ కాప్ షేర్లలో రిస్క్ అధికంగా ఉంటుంది. లార్జ్ కాప్ షేర్లలో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. పెట్టుబడులను మీ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ఎంపికచేసుకోవచ్చు.
అవగాహన ఉన్న రంగాలైతే మేలు
ఒక వ్యక్తి స్టీల్, పవర్, నిర్మాణ రంగాల్లో పనిచేశారు. అందువల్ల అతడికి ఇతర పరిశ్రమలతో పోలిస్తే ఈ మూడు రంగాలపై మంచి అవగాహన, ఆసక్తి, విశ్లేషణ శక్తి మెరుగ్గా ఉంటుంది. కనుక, ఈ రంగాల్లో అతడి మార్కెట్ పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే అతడు ఇతర రంగాలపై పట్టున్న వారితో సర్కిల్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మరిన్ని మంచి స్టాక్స్‌ను గుర్తించగలుగుతాడు. మెరుగైన స్టాక్స్‌ను గుర్తించడానికి ప్రతి పెట్టుబడిదారుడు తమ విశ్లేషణ పరిధిని పెంచుకోవాలి.
సమగ్ర అధ్యయనం అవసరం
మీరు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నా సరే ఆ రంగంపై సమగ్ర పరిశోధన చేయడం చాలా అవసరం. ముఖ్యంగా వివిధ స్టాక్స్‌పై సమగ్ర అధ్యయనం నిర్వహించడం అనేది విజయవంతమైన స్టాక్ మార్కెట్ పెట్టుబడికి కీలక అడుగు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఏదైనా కంపెనీ షేర్ కొనుగోలు చేసేముందు ఆ సంస్థ ప్రాథమిక అంశాలను లోతుగా పరిశోధించడం అత్యవసరం. కంపెనీ ఆదాయం, ఖర్చులు, దాని ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టాలి. సంస్థ వార్షిక నివేదికలను పరిశీలించడం ద్వారా ఒక అంచనాకు రావచ్చు. కంపెనీ వృద్ధి సామర్థ్యంపై అంచనా వేయడానికి ఇండస్ట్రీ ట్రెండ్స్‌పై శ్రద్ధ వహించండి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న సంస్థ అదే ఉత్పత్తులను అందించే ఇతర కంపెనీలతో ఎలా పోటీ పడుతుందో అర్థం చేసుకోవడం అతిమఖ్యం.
పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్
వైవిధ్యం అనేది పెట్టుబడిలో ఒక ప్రాథమిక రిస్క్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీ. మీ పెట్టుబడినంతటినీ ఒకే రంగం లేదా స్టాక్‌లో పెట్టకుండా ఉండడం ద్వారా స్టాక్ అస్థిరతను, ఆ సెక్టార్‌లో ఉన్న సమస్యల ప్రభావాన్ని మీపై పడకుండా బయటపడవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో డైవర్సిఫికేషన్ ఫైనాన్సియల్‌గా దెబ్బతినకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎందుకంటే మీ పోర్ట్‌ఫోలియోలోని ఒక స్టాక్‌కు ఏర్పడిన నష్టాన్ని వేరేదాని లాభాలతో కవర్ చేసుకోవచ్చు. దీనివల్ల రిస్క్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఏర్పుడుతుంది. పోర్ట్‌ఫోలియో విభిన్నంగా ఉంటేనే అది మంచి పెట్టుబడి.