Stock Market Close Today October 25th, 2024 : గత 5 రోజులుగా మదుపర్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు, శుక్రవారం కూడా భారీ నష్టాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడమే ఇందుకు కారణం. దీనికి తోడు పెద్దపెద్ద కంపెనీల త్రైమాసిక ఫలితాల్లో మెరుపులు లేకపోవడం సూచీల పతనానికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు.
దీనితో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు క్షీణించి దాదాపు రూ.437 లక్షల కోట్లకు చేరింది.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 662 పాయింట్లు నష్టపోయి 79,402 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,180 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు :ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హిందూస్థాన్ యూనిలివర్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే ఇండియా
- నష్టపోయిన షేర్లు :ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ