Step Up Home Loan : మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. కానీ దానిని నెరవేర్చుకోవడం అంత సులువు కాదు. చాలా మంది సొంతిల్లు కొందామని ప్రయత్నించి, ఈఎంఐ భారం గురించి ఆలోచించి తమ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. ఈలోగా ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోతుంటాయి. దీనితో వారి సొంతింటి కల కలగానే మిగిలిపోతుంటుంది. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో ఉన్న వారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. భవిష్యత్‌లో వేతనం పెరుగుతుందన్న నమ్మకం ఉన్నా, అప్పటి వరకు వేచి చూస్తే ఇళ్ల ధరలు ఊహకందనంత ఎక్కువగా పెరిగిపోతుంటాయి. ఇలాంటి వారి కోసమే, చాలా బ్యాంకులు 'స్టెప్-అప్ హోమ్‌లోన్స్' (Step- up home loan) అందిస్తున్నాయి.
ఈఎంఐ ఎలా ఉంటుంది?
ఉదాహరణకు ఓ 25 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే, ఆ మొత్తాన్ని బట్టి నెలనెలా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తొలినాళ్లలో ఈఎంఐలో అసలు తక్కువగా, వడ్డీ భాగం అధికంగా ఉంటుంది. ఏళ్లు గడిచేకొద్దీ చెల్లించే మొత్తంలో అసలు మొత్తం (ప్రిన్సిపల్ అమౌంట్) పెరుగుతుంటుంది.
దీనిని మరింత సింపుల్గా చెప్పాలంటే, స్టెప్-అప్ హోమ్ లోన్ తీసుకుంటే, ఆరంభంలో ఈఎంఐ మొత్తం తక్కువగా ఉంటుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఈఎంఐ మొత్తం పెరుగుతుంటుంది. ఎవరికైనా కెరీర్ ప్రారంభంలో జీతభత్యాలు తక్కువగా ఉంటాయి. తర్వాత అవి క్రమంగా పెరుగుతుంటాయి. అలాంటి వారికి ఈ స్టెప్-అప్ హోమ్ లోన్ ప్రయోజనకంగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని చాలా బ్యాంకులు ఈ తరహా రుణాలను అందిస్తున్నాయి.
లాభనష్టాలు ఇవే!
స్టెప్-అప్ హోమ్ లోన్ విధానంలో ఈఎంఐ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ రుణ మొత్తాన్ని పొందేందుకు వీలు ఉంటుంది. ముఖ్యంగా తక్కువ వయస్సులోనే గృహ రుణం తీసుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీర్ఘకాలం పాటు ఈఎంఐ చెల్లించే వెసులుబాటు లభిస్తుంది. కెరీర్ ఆరంభంలోనే ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.