Stock Market Investment Tips :స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అయితే సరైన అవగాహనతో, పక్కా వ్యూహంతో పెట్టుబడి పెడితే కచ్చితంగా లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. వీటి గురించి కచ్చితమైన అవగాహన ఉండాలి. అప్పుడే వీటిలో పెట్టుబడులు పెట్టి, మీ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకోగలరు. అందుకే వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
డైవర్సిఫికేషన్
స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్లను కంపెనీల పరిమాణం, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా వర్గీకరిస్తారు.
- భారీ పెట్టుబడితో, పెద్ద స్థాయిలో వ్యాపారం చేసే కంపెనీ స్టాక్లను లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు. ఇలాంటి కంపెనీలు ఎలాంటి ఒడుదొడుకులు వచ్చినా, తట్టుకొని నిలబడగలుగుతాయి. పెట్టుబడిదారులకు దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి.
- స్మాల్ క్యాప్ కంపెనీలకు భారీ పెట్టుబడులు ఉండవు. అలాగే వాటి వ్యాపార పరిధి కూడా తక్కువగానే ఉంటుంది. కనుక మార్కెట్ ఒడుదొడుకులను ఇవి తట్టుకోలేవు. కానీ అన్నీ కలిసి వస్తే, ఇవి పెట్టుబడిదారులకు భారీ లాభాలను ఆర్జించిపెట్టగలవు.
- మిడ్ క్యాప్ కంపెనీల పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. మిడ్ క్యాప్ కంపెనీలకు భారీ పెట్టుబడుల మద్దతు ఉండదు. కానీ చిన్నపాటి మార్కెట్ అస్థిరతలను ఇవి కొంత వరకు తట్టుకోగలవు. అదే సమయంలో ఇవి మంచి గ్రోత్ పొటెన్షియాలిటీని కలిగి ఉంటాయి.
- కనుక పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసుకోవాలి. అంటే తమ పోర్ట్‌ఫోలియోలో తగు నిష్పత్తిలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను చేర్చుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గుతుంది. దీర్ఘకాలంలో మంచి రాబడులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.
గ్రోత్ ఆపర్చూనిటీస్
- స్మాల్ క్యాప్ కంపెనీలకు వృద్ధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా ప్రారంభించిన కంపెనీలు, బిజినెస్‌లు, స్టార్టప్‌లకు మంచి గ్రోత్ పొటెన్సియాలిటీ ఉంటుంది. కనుక పెట్టుబడిదారులకు భారీ లాభాలు వచ్చే అవకాశముంది. అయితే వీటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువగా ఉంటుంది. కనుక మార్కెట్ ఒడుదొడుకులను ఇవి తట్టుకోలేకపోవచ్చు. ఇది పెట్టుబడిదారులకు కాస్త రిస్క్ అనే చెప్పవచ్చు.
- లార్జ్ క్యాప్ కంపెనీల వద్ద భారీ స్థాయిలో మూలధనం ఉంటుంది. కనుక మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకుని ఇవి నిలబడగలుగుతాయి. కనుక పెట్టుబడిదారులకు నష్టభయం తక్కువగా ఉంటుంది. పైగా దీర్ఘకాలంలో మంచి రాబడులు సంపాదించే అవకాశముంటుంది.
- మిడ్ క్యాప్ కంపెనీ పరిస్థితి కాస్త మధ్యస్థంగా ఉంటుంది. దీనిలో రిస్క్, రివార్డ్ రెండూ సమాన స్థాయిలో ఉంటాయి. కనుక మీ పోర్ట్‌ఫోలియోలో ఈ మూడు కేటగిరీల స్టాక్లను తగు నిష్పత్తిలో చేర్చుకోవడం మంచిది.