Senior Citizen Savings Scheme : పదవీవిరమణ తర్వాత సుఖంగా జీవించడానికి తప్పనిసరిగా ముందుగానే ఆర్థిక ప్రణాళికను వేసుకోవాలి. ఉద్యోగం చేస్తున్న సమయం నుంచి సరైన విధంగా పొదుపు చేస్తే, వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. అదే విధంగా పదవీవిరమణ చేసిన తర్వాత కూడా, మీ దగ్గర ఉన్న డబ్బును మంచి పథకాలలో పెట్టుబడి పెట్టి అధిక రాబడిని పొందొచ్చు. ఇందుకోసం అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వాటిలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి.
నో రిస్క్
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది నెలవారీ ఆదాయాన్ని సంపాదించడానికి వృద్ధులకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వ పథకం కనుక ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా మిగతా పథకాలతో పోలిస్తే వడ్డీ కూడా అధికంగా వస్తుంది. కనుక నెలకు రూ.20 వేల వరకు స్థిరమైన రాబడి పొందాలనుకునేవారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. మరి ఇంత డబ్బు రావాలంటే, ఒకేసారి ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి? అర్హతలు ఏమిటి? మొదలైన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలివే!
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం తీసుకొచ్చింది. 55-60 ఏళ్ల మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవారు కూడా ఈ పథకానికి అర్హులే. మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో, 8.2 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్కీమ్‌లో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు పెట్టుబడులు పెట్టవచ్చు.