తెలంగాణ

telangana

'పాజిటివ్ పే సిస్టమ్'తో బ్యాంకు చెక్ మోసాలకు గుడ్​బై! ఎలా పనిచేస్తుందంటే? - cheque payments

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 8:01 PM IST

Secure Your Cheque Payments : మీరు చెక్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. చెక్ ద్వారా జరిగే మోసాలను, ఫోర్జరీలను అరికట్టేందుకు ఆర్​బీఐ 'పాజిటివ్ పే సిస్టమ్' అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఇదేలా పనిచేస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Secure Your Cheque Payments
Secure Your Cheque Payments (Getty Images)

Secure Your Cheque Payments : చెక్కుల ద్వారా జరిపే లావాదేవీలకు అధిక భద్రత ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే ఇటీవల కాలంలో ఫోర్జరీలు, నకిలీ చెక్​లతో లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టడానికి, చెక్కు ద్వారా జరిపే లావాదేవీల భద్రతను మరింత మెరుగుపర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. అదే పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్‌). చెక్కుల ద్వారా చేసిన లావాదేవీలన్నింటినీ ఇది సురక్షితంగా ఉంచుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటి?
పెరుగుతున్న చెక్ ఫ్రాడ్ కేసులను అరికట్టేందుకు ఆర్​బీఐ 2021లో పాజిటివ్ పే సిస్టమ్‌ ను ప్రవేశపెట్టింది. ఇది ఎలక్ట్రానిక్ ఆథెంటికేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. పెద్ద విలువ ఉన్న చెక్కును చెల్లింపు కోసం సమర్పించే ముందు దాని ముఖ్య వివరాలను బ్యాంకుతో పంచుకోవాల్సి ఉంటుంది. అంటే చెక్కు జారీ చేసేవారు (డ్రాయర్) దాని వివరాలను లబ్ధిదారునికి అందజేసే ముందు బ్యాంకుతో పంచుకుంటారు. ఇందులో సాధారణంగా చెక్ నంబర్, చెక్ తేదీ, చెల్లింపుదారుడి పేరు, బ్యాంకు అకౌంట్ నంబర్, అమౌంట్, ఇతర సంబంధిత వివరాలు ఉంటాయి.

పాజిటివ్ పే సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
లబ్ధిదారుడు ఎన్​క్యాష్‌ మెంట్ కోసం చెక్కును సమర్పించినప్పుడు, డ్రాయర్ అందించిన సమాచారంతో బ్యాంకు వివరాలను ధ్రువీకరిస్తుంది. వివరాలు సరిపోలితే, చెక్ ప్రాసెస్ అవుతుంది. ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే, తదుపరి ధ్రువీకరణ కోసం బ్యాంక్ చెక్​ను హోల్డ్‌ చేస్తుంది. ప్రక్రియ ఇలా ఉంటుంది.

చెక్కు జారీ :మీరు రూ.50వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన చెక్కును జారీ చేసినప్పుడు, దాని వివరాలను స్వచ్ఛందంగా మీ బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది.

చెక్ వివరాలు :చెక్కు ఇచ్చే వారు ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తిలో అంటే నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, ఎస్ఎంఎస్ లేదా బ్యాంకు బ్రాంచ్​కు వెళ్లి చెక్ నంబర్, తేదీ, అమౌంట్, చెల్లింపుదారుడి పేరు, అకౌంట్ నంబరు వంటి వివ‌రాల‌ను బ్యాంకుకు తెలియజేయవచ్చు.

బ్యాంకు ధ్రువీకరణ : చెల్లింపు కోసం చెక్కును సమర్పించినప్పుడు బ్యాంకు ఈ వివరాలను ధ్రువీకరిస్తుంది.

మెరుగైన భద్రత : వివరాలు సరిపోలితే, చెక్ క్లియర్ అవుతుంది. ఏదైనా వ్యత్యాసాలు ఉంటే బ్యాంకు హోల్డ్​లో ఉంచుతుంది. మోసపూరిత చెక్కులను నగదుగా మార్చే అవకాశాలను తగ్గిస్తుంది.

పాజిటివ్ పే సిస్టమ్ తో ప్రయోజనాలివే!
మోసాలను అరికడుతుంది :చెక్ వివరాలను ధ్రువీకరించడం ద్వారా నకిలీ చెక్కుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అధిక భద్రత :మీ చెక్ చెల్లింపులకు అదనపు రక్షణను ఇస్తుంది.

వేగంగా క్లియరెన్స్‌ : వ్యత్యాసాల కారణంగా చెక్ రిటర్న్​ల అవకాశాలను తగ్గిస్తుంది.

ఈ విషయాల చాలా ముఖ్యం!

  • రూ.50 వేలు అంత‌కంటే ఎక్కువ మొత్తంలో జారీ చేసిన చెక్కుల‌ను పునర్ ​స‌మీక్షించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయ‌వ‌చ్చు, లేదా వినియోగ‌దారుని అభీష్టం మేర‌కు వదిలివేయవ‌చ్చు. అయితే, రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం గ‌ల‌ చెక్కుల విషయంలో తప్పనిసరిగా పాజిటివ్ పే సిస్టమ్ ను అమ‌లు చేయాల్సి ఉంటుంది.
  • మీరు చెక్ వివరాలను సమర్పించిన తర్వాత వాటిని మార్చలేరు, తొలగించలేరు.
  • మీరు చెక్కును అందించడానికి ముందే దాని చెల్లింపును నిలిపివేయవచ్చు.
  • భారతదేశంలోని చాలా బ్యాంకులు రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న చెక్కుల కోసం పీపీఎస్‌ ను అమలు చేస్తున్నాయి.
  • పాజిటివ్ పే సిస్టమ్‌ ను ఎలా ఉపయోగించాలో వంటి మరిన్ని వివరాల కోసం కస్టమర్లు తమ సంబంధిత బ్యాంకులను సంప్రదించాలి.

గూగుల్​ పే, ఫోన్​ పేలో పే చేస్తున్నారా? - రోజుకు ఏ బ్యాంకుకు లిమిట్​​ ఎంతో తెలుసా? - How much UPI transactions in banks

EPS పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్‌ - ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ తీసుకునే వీలు - Pension Withdrawal From Any Bank

ABOUT THE AUTHOR

...view details