Second Hand Bike Documents Required : సాధారణంగా కొంత మంది పాత బైక్‌లను కొనుగోలు చేస్తుంటారు. బైక్ కొనుగోలు చేసేటప్పుడు ఇంజిన్, బ్రేకులు, టైర్లు ఇలా అన్ని సరిగా ఉన్నాయా? లేదా? అని చూస్తుంటారు. ఇది మంచిదే. అయితే వీటితో పాటు ఆ బైక్‌కు సంబంధించిన యాజమాన్య బదిలీ కూడా అత్యంత కీలకమైనదని దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే బైక్ అధికారికంగా మీకు సొంతం అవుతుంది. మరి బైక్ ఓనర్షిప్ బదిలీ కోసం ఏయే డాక్యుమెంట్లు అవసరమవుతాయి?. రిజిస్ట్రేషన్ కోసం ఏయే పత్రాలు మీ వద్ద ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ) తప్పనిసరి
RC Book (Registration Certificate) : సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా చెక్ చేయాల్సింది ఆ బైక్‌కు ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) ఉందా? లేదా? అని. ఆర్సీ ఉంటే ఆ బైక్‌కు రిజిస్ట్రేషన్ అయిందని అర్థం. బైక్ యాజమాన్య హక్కుల్ని మరొకరి పేరుమీద మార్చాలంటే ఆర్టీవో ఆఫీసులో ఈ డాక్యుమెంట్‌ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అందువల్ల మీరు పాత బైక్‌ను వేరొకరి నుంచి కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆర్సీని ఇవ్వమని అడగండి.
ఆర్సీ బుక్‌లో అమ్మకందారు పేరు, బైక్ నంబరు, ఇంజిన్ నంబరు, ఛాసిస్ నంబర్ సహా కీలక వివరాలు ఉంటాయి. ఒక వేళ అమ్మిన వ్యక్తి బ్యాంక్ లోన్ తీసుకుని బైక్‌ను కొన్నట్లు అయితే, ఆర్సీ బుక్‌పై బ్యాంక్ స్టాంప్ ఉంటుంది. అలాంటప్పుడు బ్యాంకు నుంచి ఫారమ్ 35తో పాటు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను పొందాలి. అప్పుడే లోన్ మొత్తం చెల్లించనట్లు మీకు ఆధారం లభిస్తుంది.
ఇన్సూరెన్స్ సర్టిఫికెట్
Insurance Certificate : మోటారు వెహికల్ రూల్స్ ప్రకారం, అన్ని వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి. ఒక వేళ మీరు కొన్న వాహనానికి ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ లేకపోయినట్లయితే ఆర్టీఓ ఆఫీస్‌లో ఆ బైక్ రిజిస్ట్రేషన్ అవ్వలేదని అర్థం. అందువల్ల మీరు పాతబైక్ను ఇతరుల నుంచి కొనుగోలు చేసేటప్పుడే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వమని వారిని అడగండి. తరువాత బీమా కంపెనీలతో సంప్రదించి, మీ పేరు మీద ఇన్సూరెన్స్‌ను మార్చుకోండి. నేడు ఆన్లైన్లో కూడా సులభంగా బైక్ ఇన్సూరెన్స్‌కు అప్లై చేసుకోవచ్చు.
పొల్యూషన్ సర్టిఫికెట్
PUC Certificate :సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా పరిశీలించవలసిన మరో ముఖ్యమైన డాక్యుమెంట్ పొల్యూషన్ సర్టిఫికెట్. దీనినే పీయూసీ(పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఫర్ బైక్)గా వ్యవహరిస్తుంటారు. బైక్ నుంచి కాలుష్య కారకాలు ఎంత వరకు విడుదల అవుతున్నాయి? ఇవి కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు లోబడి ఉన్నాయా? లేదా? అని చెక్ చేసి పొల్యుషన్(పీయూసీ) సర్టిఫికెట్ ఇస్తారు. పొల్యుషన్ చెక్ చేసి సర్టిఫికెట్లను జారీ చేసేందుకు దేశవ్యాప్తంగా పలుచోట్ల సెంటర్లు ఉన్నాయి.