How To Claim Car Insurance : చాలా మందికి సొంతంగా కారు కొనడం అనేది ఒక కల. దాని కోసం పొదుపు చేసి మరి కొత్త కారును కొంటుంటారు. కానీ కొన్ని సార్లు అనుకోకుండా కారు డ్యామేజ్ అవుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా వాహనం దెబ్బతింటుంది. ఇక దాన్ని రిపేర్ చేయించుకోవడం అంటే చాలా ఖర్చు అవుతుంది. అయితే ఇన్సూరెన్స్‌తో ఆ నష్టాన్ని కొంతమేర భర్తీ చేయొచ్చు. ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ, దానిని ఎలా క్లెయిమ్ చేయాలో చాలా మందికి తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగితే కారు ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బీమా కంపెనీ తెలియజేయాలి
కారు ప్రమాదానికి గురైన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాత ప్రమాదం గురించి వెంటనే పోలీసులకు తెలియజేయాలి. అవసరమైతే ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలి. సాధారణంగా దొంగతనం, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లేదా వాహనంలో అగ్నిప్రమాదం వంటివి జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. కారు కేవలం చిన్న చిన్న పగుళ్లు, గీతలు పడితే ఎఫ్ఐఆర్ అవసరం లేదు. అయితే ఈ ప్రమాదంలో థర్డ్ పార్టీ ప్రమేయం ఉంటే తప్పని సరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫొటోలు తీయాలి
కారు డ్యామేజ్, ప్రమాద స్థలం స్పష్టం ఉండేలా ఫొటోలు తీయాలి. ఎంతమేరకు డ్యామేజ్ అయ్యిందో స్పష్టంగా కనిపించాలి. తద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడే క్లెయిమ్ ప్రాసెస్ వేగంగా చేయడానికి వీలువుతుంది.
బీమా సంస్థకు అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలి
క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం ఇన్సూరెన్స్‌కు సంబంధించిన పత్రాలను కంపెనీకి ఇవ్వాలి. వాటితో పాటు ఎఫ్ఐఆర్ కాపీ, యజమాని డ్రైవింగ్ లైసెన్స్, మీ కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సరైన పత్రాలను ఇవ్వడం వల్ల క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది.
కారు రిపేర్ చేయాలి
దెబ్బతిన్న వాహనాన్ని రిపేర్ చేయడం కోసం గ్యారేజీకి తీసుకెళ్లవచ్చు. అలా కాకుండా కారును రిపేర్ చేయించమని ఇన్సూరెన్స్ కంపెనీని కూడా అడగవచ్చు. ఒకవేళ మీరే కారును రిపేర్ చేయించుకోవాలనుకుంటే బీమా పాలసీ ఆధారంగా మీ ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ.
అయితే, మీరే కారు రిపేర్ చేసుకుంటే- క్లెయిమ్ సెటిల్మెంట్ను రెండు రకాలుగా చేసుకోవచ్చు. మొదటగా కారు డ్యామేజీని అంచనా వేసి ఖర్చులకు డబ్బులను ఇస్తుంది ఇన్సూరెన్స్ సంస్థ. అలాకాకుండా రిపేర్ చేయడానికి ముందు ఖర్చు ఎంత అవుతుందో లేదా రిపేర్ చేశాక దాని ఖర్చుల విలువరాలను తెలియజేస్తే బీమా పాలసీ ప్రకారం కంపెనీ తిరిగి కారు యజమానులకు చెల్లిస్తుంది.
ఫస్ట్ టైమ్ కొత్త కారు కొన్నారా? డెలివరీకి ముందు కచ్చితంగా ఈ 5 అంశాలను చెక్ చేయాల్సిందే!