SEBI Chief About SME And IPO Price Manipulation :స్టాక్ మార్కెట్లో పలు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల ధరలు బుడగల్లా పెరుగుతున్నాయని, అవి ఏమాత్రం సహేతుకంగా కనిపించడం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్ పేర్కొన్నారు. 'చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎస్‌ఎమ్‌ఈ)ల విభాగంలోని షేర్ల ధరల్లో చాలా అవకతవకలు జరుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని' ఆమె అన్నారు. కనుక మదుపరులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీగా పెరుగుతున్న స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ ధరలు!
2023 జనవరి నుంచి 'చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల ధరలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఇవి కచ్చితంగా బుడగల్లాంటివే. ఒక్కసారి ఈ బుడగలు పేలితే మదుపరులు భారీగా నష్టపోవడం ఖాయం. అది ఇండియన్ మార్కెట్‌లకు కూడా మంచిది కాదు. వాస్తవానికి పెరుగుతున్న షేర్ల ధరలకు, ఆయా కంపెనీల ఆర్థిక మూలాలకు ఏమాత్రం సంబంధం కనిపించడం లేదు. ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి సహేతుక ధరల వద్ద ట్రేడ్ కావడం లేదు. మరీ ముఖ్యంగా 2023 జనవరి నుంచి ఈక్విటీ మార్కెట్లలో చిన్న, మధ్యస్థాయి షేర్లు కీలక సూచీలను మించి వేగంగా పెరుగుతున్నాయి' అని మాధవి పురి బచ్ వివరించారు. ఇప్పటికే చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ తరహా షేర్లలో పెట్టుబడులను అంగీకరించడం లేదని, నెలవారీ పెట్టుబడుల్లోనూ పరిమితులు విధిస్తున్నాయని ఆమె గుర్తు చేశారు.
ఐపీఓల్లోనూ ఇదే ధోరణి!
ఎస్‌ఎమ్‌ఈ విభాగానికి చెందిన ఐపీఓల్లోనూ, మార్కెట్ ట్రేడింగ్‌లోనూ, ధరల్లో చాలా అవకతవకలు జరుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని మాధబి పురి బచ్ పేర్కొన్నారు. అయితే వీటిపై ఇంకా చాలా విశ్లేషణ చేయాల్సి ఉందని ఆమె తెలిపారు. ఏవైనా తప్పులు కనిపిస్తే మాత్రం, వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్‌ఎమ్‌ఈ విభాగంలోని కంపెనీలు మదుపర్లకు కచ్చితంగా మార్కెట్ రిస్కుల గురించి వివరించాలి అని ఆమె సూచించారు.
కంపెనీలు ఏమంటున్నాయంటే?
చిన్న, మధ్య స్థాయి షేర్లపై సెబీ వ్యక్తం చేసిన ఆందోళనలపై, పరిశ్రమ వర్గాలు భిన్నంగా స్పందించాయి. ఎస్‌ఎమ్‌ఈ విభాగంలో ప్రమాదకర రీతిలో ఎటువంటి ఉపసంహరణలు (రిడెమ్షన్స్) జరగలేదని పేర్కొన్నాయి. మిడ్‌క్యాప్ ఫండ్ పథకాల్లోకి 2023లో రూ.23,000 కోట్లు రాగా, చిన్న స్థాయి ఫండ్ పథకాల్లోకి రూ.41,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని తెలిపాయి. 2022లోనూ వరుసగా రూ.20,550 కోట్లు; రూ.19,795 కోట్లు మేర ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని పేర్కొన్నాయి.
తక్షణమే సెటిల్‌మెంట్!
2024 మార్చి 28 నుంచి షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా వెంటనే సెటిల్‌మెంట్ కానున్నాయని మాధబి పురి బచ్ స్పష్టం చేశారు. టీ+0గా వ్యవహరించే ఈ విధానాన్ని ఎంచుకునే వీలు(ఆప్షనల్)ను మదుపరులకు కల్పిస్తామని ఆమె తెలిపారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లోని అన్ని షేర్లను టీ+1 పద్ధతిలో సెటిల్ చేస్తున్నారు. అంటే లావాదేవీ జరిగిన మరుసటి ట్రేడింగ్ రోజున సెటిల్‌మెంట్ జరుగుతోంది. కానీ టీ+0 విధానం అమలులోకి వస్తే, చైనా తర్వాత అతి తక్కువ సమయంలో సెటిల్‌మెంట్ చేసే దేశంగా ఇండియా నిలుస్తుంది. ప్రస్తుతం చాలా దేశాల్లో సెటిల్‌మెంట్‌కు కనీసం 2 రోజుల సమయం పడుతోంది.