Road Safety Tips :ప్రస్తుత కాలంలో బైక్, కారు ఇలా ఏదో ఒక వాహనం ప్రతి ఇంట్లోనూ ఉంటోంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు, దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కారును వాడుతున్నారు. మార్కెట్, చిన్నచిన్న పనులకు వెళ్లడం కోసం బైక్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎంత జాగ్రత్తగా వెళ్లినా, అవతలి వారు చేసిన తప్పు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన టాప్-10 జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. ఏకాగ్రతగా ఉండండి
మీరు కారు డ్రైవింగ్ చేసినప్పుడు ఏకాగ్రతగా ఉండండి. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించకండి. లేదంటే యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. కారు టర్న్ చేస్తున్నప్పుడు వెనుక ఉన్న వాహనాలను గమనించండి.
2. బ్యాడ్ మూడ్‌లో డ్రైవింగ్ చేయవద్దు
మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయవద్దు. మీ మానసిక స్థితి సరిగ్గా లేకపోతే, వెయిటింగ్ లేన్‌లో కారును కాసేపు ఆపి విశ్రాంతి తీసుకోండి. మీకు ఇష్టమైన పాటలను వినండి. లేదంటే మీ ప్రియ స్నేహితుడికి కాల్ చేసి మాట్లాడండి. అప్పుడు మీ మనసు కుదుటపడుతుంది. ప్రతికూల ఆలోచనలు మీ డ్రైవింగ్‌పై ప్రభావం చూపుతాయి. దీంతో డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ఏకాగ్రత దెబ్బతిని యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. అతివేగం, రాంగ్ రూట్, ఓవర్‌టేక్ చేయడం వంటివి చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి.
3. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జాగ్రత సుమా!
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడినప్పుడు వాహనాన్ని ఆపండి. మీకు ఎంత అత్యవసరమైనా ఆ సిగ్నల్ పడినప్పుడు జంక్షన్‌ను క్రాస్ చేయవద్దు. లేదంటే ఫైన్ పడుతుంది. అలాగే ప్రమాదం జరిగే కూడా ఉంది.
4. మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు
మద్యం సేవించి వాహనం నడపరం నేరం, ప్రమాదకరం. అందుకే మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దు. మద్యం మత్తులో డ్రైవింగ్ సరిగ్గా చేయలేకపోవచ్చు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు అనుసరించాల్సిన ముఖ్యమైన భద్రతా చిట్కాలలో ఇదొకటి.
5. రెస్ట్ తీసుకోండి
మీరు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు కారును కాసేపు ఆపి రెస్ట్ తీసుకొండి. ప్రతి రెండు గంటలకు ఒకసారి స్టాప్ ఓవర్(ప్రయాణ విరామం) ఉండేలా ప్లాన్ చేసుకోండి. లేదంటే బాగా అలసిపోతారు. దీని వల్ల కునుకుపాట్లు లాంటివి పడి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.