Road Safety Tips :భారతదేశంలో రహదారి భద్రత అనేది ప్రభుత్వాలకు సవాలుగా మారింది. భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ "భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు- 2022" వార్షిక నివేదికను ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం, దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తంగా 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ దుర్ఘటనల్లో ఏకంగా 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా ఆందోళనకరమైన అంశం. అందుకే ఇలాంటి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే, డ్రైవర్లు కారుల్లో ఉండే అత్యాధునిక సేఫ్టీ ఫీచర్ల గురించి అవగాహన పెంచుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్‌లో కారులో ఉండే అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు గురించి తెలుసుకుందాం.
1. Advanced Driver Assistance System (ADAS) :ప్రస్తుతం చాలా ఆటోమొబైల్ కంపెనీలు, తమ బ్రాండెడ్ కార్లలో స్టాండర్డ్‌గా 'అడ్వాన్క్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్'ను పొందుపరుస్తున్నాయి. దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే, రోడ్డు ప్రమాదాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అందుకే ADAS గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC) :రోడ్డుపై వెళ్తున్నప్పుడు ముందున్న వాహనానికి, మన కారు ఎంత దూరంలో ఉందో అంచనా వేసి, కారు వేగాన్ని ఆటోమేటిగ్గా మారుస్తుంది. దీని వల్ల మన కారు ఎదుటి వాహనాలను ఢీకొనే ప్రమాదం తప్పుతుంది.
- ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ (FCW) :మన కారు ఎదురుగా ఉన్న ఏదైనా వాహనానికి చాలా దగ్గరగా వెళ్లినప్పుడు, ఈ ఎఫ్సీడబ్ల్యూ ఫీచర్ వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఈ వార్నింగ్ సిస్టమ్ - సెన్సార్లు, కెమెరాలతో అనుసంధానమై పనిచేస్తుంది. అందువల్ల వాహనాల మధ్య సరైన దూరం పాటించడానికి వీలవుతుంది. ఫలితంగా వాహనానికి, డ్రైవర్లకు భద్రత చేకూరుతుంది.
- లేన్ డిపార్చర్ వార్నింగ్ (LDW) :అనుకోకుండా మన వాహనం లేన్ నుంచి పక్కకి వెళ్తే, డ్రైవరును హెచ్చరించే ఆధునిక భద్రత ఫీచర్ ఇది. దీనిలోని ఫార్వర్డ్ ఫేసింగ్ AI కెమెరా లేన్ మార్కింగ్‌లను పర్యవేక్షిస్తుంది. ఒకవేళ మన కారు లేన్‌ను దాటితే, వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.
- పాదచారుల గుర్తింపు వ్యవస్థ (PDS) :ఈ పీడీఎస్ ఫీచర్ ఉన్న కార్లు రహదారిపై, ఫుట్‌పాత్‌లపై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులను గుర్తిస్తుంది. పొరపాటున మన వాహనం వారికి చేరువగా వెళ్తే, వెంటనే డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. దీని వల్ల ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.
- హెడ్-అప్ డిస్ప్లే (HUD) :ఈ ఫీచర్ ఉన్న కార్లలో కీలక సమాచారం అంతా విండ్ స్క్రీన్ మీదే డిస్ప్లే అవుతుంది. దీని వల్ల డ్రైవర్ వాహనాన్ని నడుపుతున్నప్పుడు, కారులోని వివిధ ప్యానెల్స్, బటన్స్‌ను చూడాల్సిన అవసరం ఏర్పడదు. కనుక డ్రైవర్ రోడ్డు మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించగలుగుతాడు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.
2. Driver Monitoring System (DMS) :డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అనేదివాహనం నడుపుతున్న డ్రైవర్ ప్రవర్తనను ట్రాక్ చేస్తుంది. ఇందులోని AI కెమెరా డ్రైవింగ్‌ను చాలా సునిశితంగా పర్యవేక్షిస్తుంది.
- డ్రైవర్ అలసటను గుర్తించడం :డ్రైవర్లు బాగా అలసిపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలను డ్రైవర్ మోనిటరింగ్ సిస్టమ్ బాగా తగ్గిస్తుంది. ఇది డ్రైవర్ ముఖాన్ని పర్యవేక్షిస్తుంది. డ్రైవర్ ఆవలించడం, కళ్ళు మూసివేయడం, తల వాలిపోవడం లాంటి అలసట సంకేతాలను గుర్తిస్తే, వెంటనే డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. అతను నిద్రలోంచి మేలుకునేలా చేస్తుంది. ఫలితంగా చాలా వరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది.
- రియల్ టైమ్ డిటెక్షన్ :డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ముందున్న దారిపైన, వాహనాల మీద దృష్టి పెట్టకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉంటే, వెంటనే అతనిని 'డీఎంఎస్' హెచ్చరిస్తుంది.
- స్పీడ్ డిటెక్షన్ ఫ్రమ్ జీపీఎస్ :జియో ఫెన్సింగ్ మొబైల్ సర్వీసెస్ (GMS) అనేది డ్రైవర్లు మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తుంటే, జీపీఎస్ టెక్నాలజీ ద్వారా అప్రమత్తం చేస్తుంది. దీని వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
3. Intelligent Traffic Management System :ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది 'స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్', ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్' అనుసంధానంతో పనిచేస్తుంది. దీని వల్ల వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నా, ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు.
రియల్ టైమ్ మానిటరింగ్ : రియల్ టైమ్ ట్రాకింగ్ చేస్తూ ప్రమాదం జరిగే అవకాశాలను తక్షణమే గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. దీని వల్ల కారులోని ప్రయాణికులు గాయాలపాలు కాకుండా, సురక్షితంగా బయటపడగలుగుతారు.