తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్​పై భారీ ఆశలు- స్థిరాస్తి రంగానికి ఊరట లభిస్తుందా? - UNION BUDGET 2025

కేంద్ర వార్షిక బడ్జెట్‌పై గృహ నిర్మాణ రంగం, పట్టణ రంగానికి చెందిన వారి గంపెడాశలు

Union Budget 2025 Housing
Union Budget 2025 Housing (Getty Images, ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2025, 8:56 PM IST

Union Budget 2025 Housing :ఈ ఏడాది ప్రవేశపెట్టే కేంద్ర వార్షిక బడ్జెట్‌పై గృహ నిర్మాణ రంగం, పట్టణ రంగానికి చెందిన వారు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సారి బడ్జెట్‌లో కీలకమైన రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పెద్ద ఎత్తున వరాలను ఆశిస్తున్నారు. ఈ రంగం పుంజుకుంటే లక్షలాది మందికి ఉపాధి లభించడం సహా వ్యవస్థలోకి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది. హౌసింగ్ రంగానికి పన్ను మినహాయింపుతో పాటు, రియల్ ఎస్టేట్‌ను పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ల నెలకొన్న వేళ ఈ ఏడాది పద్దుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ఉన్న ఆశలేంటో ఈ కథనంలో చూద్దాం.

రియల్ ఎస్టేట్ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతోంది. 200కి పైగా కంపెనీలు గృహనిర్మాణ రంగంలో ప్రత్యక్షంగా ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్‌పై గృహా నిర్మాణ రంగం, పట్టణ రంగం వాటాదారుల్లో అంచనాలు నెలకొన్నాయి. హౌసింగ్ రంగానికి కొంత మొత్తానికి పన్ను మినహాయింపుతో పాటు రియల్ ఎస్టేట్‌ను పరిశ్రమగా గుర్తించాలని వారు ఆశిస్తున్నారు. నిర్మాణ రంగంలో జీఎస్​టీ తగ్గించే విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, ఇదే తమ రంగానికి బడ్జెట్​పైన ఉన్న ఏకైక ప్రాధాన్యతని అంటున్నారు. ఇప్పటికే వినియోగదారులు అనేక రకాలు పన్నుల భారంతో ఉన్నారని, వారికి నిర్దిష్ట మినహాయింపు లభిస్తే పెద్ద ఉపశమనంగా ఉంటుందని నిర్మాణ రంగానికి చెందిన వారు చెబుతున్నారు.

జీఎస్​టీ మినహాయిస్తే భారీ ఉపశమనం
పెద్ద పెద్ద నగరాల్లో జీఎస్​టీ వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థిరాస్తి రంగానికి చెందినవారు అంటున్నారు. ఎవరైనా రూ.50 లక్షలకు ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే దాదాపు రూ.9 లక్షల వరకు జీఎస్​టీ కట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకే జీఎస్​టీని మినహాయిస్తే వారికి పెద్ద ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు బిల్డర్లు, వాటాదారులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని అంటున్నారు.

పన్ను మినహాయింపు పెంపు ఉంటుందా?
'ఇప్పటివరకు గృహ రుణాలపై రూ.2 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇస్తున్నారు. కానీ అది పాత పన్ను విధానంలో ఉంది. ప్రసుత్తం 70 నుంచి 75 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానానికి మారారు. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. ఈ నేపథ్యంలో వడ్డీ రాయితీని కొత్త టాక్స్ విధానంలో కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది జరిగితే, రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. గృహ రుణ వడ్డీలో తగ్గింపు కొనుగోలుదారులకు మద్దతు లభిస్తుంది. అలాగే గృహ రుణ వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచి మధ్యతరగతి వారు సొంతింటి కలను నిజం చేసుకునే దిశగా వారిని మరింత ప్రోత్సహించాలి' అని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ హిరానందనీ అన్నారు. స్మార్ట్‌ సిటీ మిషన్‌ను టైర్‌-2, టైర్‌-3 నగరాలకు విస్తరించాలని ఆయన కోరుతున్నారు. దానివల్ల వాటి అభివృద్ధిలో పురోగతి వస్తుందని అభిప్రాయపడ్డారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద చిన్న నగరాలను చేర్చడం వల్ల పెద్ద పెద్ద నగరాల్లో రద్దీ తగ్గుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details