RBI Monetary Policy April 2024 :కీకీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. 5:1 ఓట్ల మెజారిటీతో ఈ ద్రవ్య విధాన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు.
2023 ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తుంది. కాగా, రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఏడో సారి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ప్రకటించిన తొలి ద్వైమాసిక పరపతి విధానం ఇదే కావడం గమనార్హం.
''భారతదేశానికి ధృఢమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితి చేయాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరిగింది. అందుకే ఈ ద్రవ్యోల్బణాన్ని కట్టిడి చేసేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తుంది."
- శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్
జీడీపీ వృద్ధి రేటు 7 శాతం!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.
ఫారెక్స్ నిల్వలు
2024 మార్చి 29 నాటికి భారతదేశ ఫారెక్స్ నిల్వలు ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి (645.6 బిలియన్ డాలర్లకు) చేరుకున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలను (బఫర్) మరింత పెంచుకోవడంపై ఆర్‌బీఐ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఆర్‌బీఐ మోనటరీ పాలసీ నిర్ణయాలు
1. గ్లోబల్ డెట్-టు-జీడీపీ నిష్పత్తి ఎక్కువగా ఉంది. కనుక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై స్పిల్-ఓవర్ ప్రభావం ఉండవచ్చు.
2. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ డిమాండ్, వినియోగం పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి తొడ్పడుతుంది.
3. ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఉంది.
4. తయారీ, సేవల రంగాల్లో స్థిరమైన వృద్ధి సాధించడానికి ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది.
5. ప్రపంచ వృద్ధి ప్రస్తుతానికి స్థిరంగా ఉంది. కానీ ముడిచమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
6. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కమోడిటీ ధరలను తలకిందులు చేసే అవకాశం ఉంది.