తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంక్​ వెబ్​సైట్స్​ అడ్రెస్​కు RBI కొత్త రూల్- ఇక ఆ పదం ఉంటేనే ఒరిజినల్ అని అర్థం! - RBI ON FINANCIAL FRAUDS

ఆన్‌లైన్ ఆర్థిక మోసాల కట్టడికి బ్యాంక్.ఇన్- ప్రత్యేక డొమైన్‌ను ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్- ఆర్థిక సేవల రంగం కోసం ఫిన్.ఇన్ తీసుకొస్తామని వెల్లడి

RBI On Financial Frauds
RBI On Financial Frauds (GEtty Images)

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2025, 11:40 AM IST

Updated : Feb 7, 2025, 11:49 AM IST

RBI On Financial Frauds :ఆన్‌లైన్ ఆర్థిక మోసాల కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో దేశంలోని బ్యాంకులకు అండగా నిలిచేందుకు బ్యాంక్.ఇన్ (bank.in) ఇంటర్నెట్ డొమైన్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను తగ్గించేందుకు బ్యాంకులకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు.

2025 ఏప్రిల్ నుంచి ఇది బ్యాంకులకు అందుబాటులోకి వస్తుందని సంజయ్ మల్హోత్రా చెప్పారు. బ్యాంక్.ఇన్ అందుబాటులోకి వచ్చాక, బ్యాంకుల ఖాతాదారులు నిజమైన బ్యాంకింగ్ వెబ్‌సైట్లు, మోసపూరిత వెబ్‌సైట్ల మధ్య తేడాను సులభంగా గుర్తించగలుగుతారని తెలిపారు. తదుపరిగా దేశంలోని ఆర్థిక సేవల రంగానికి ఉపయోగపడేలా ఫిన్.ఇన్ (fin.in) డొమైన్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. "ఆన్‌లైన్/డిజిటల్ ఆర్థిక మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాటిపై ఈ రంగంలోని అన్ని పక్షాలు కలిసి ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది" అని ఆర్‌బీఐ గవర్నర్ పిలుపునిచ్చారు.

డిజిటల్ లావాదేవీల ధ్రువీకరణ కఠినతరం
ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. "బ్యాంక్.ఇన్ ఇంటర్నెట్ డొమైన్ అందుబాటులోకి వచ్చాక ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. డిజిటల్ లావాదేవీల ధ్రువీకరణ ప్రక్రియ మరింత కఠినతరం అవుతుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ వ్యవస్థలు సురక్షితంగా తయారవుతాయి" అని ఆయన చెప్పారు.

"ఇప్పటికే డిజిటల్ చెల్లింపు లావాదేవీలను పూర్తి చేసేందుకు అదనపు ధ్రువీకరణలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్‌ను త్వరలో మన దేశం నుంచి విదేశాల్లోని వ్యాపార సంస్థలకు చేసే చెల్లింపులకు కూడా వర్తింపజేస్తాం. ఫలితంగా అవి మరింత సురక్షితంగా మారుతాయి. ఈ ఫీచర్‌ను అవసరమైన వారంతా ఎనేబుల్ చేసుకోవచ్చు" అని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు.

ఎన్‌డీఎస్-ఓఎం(NDS-OM) వేదికలోకి ఇక వారికీ ఎంట్రీ
ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైలర్ల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఎన్‌డీఎస్- ఓఎం (NDS-OM) వేదిక పరిధిని పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించారు. ఈ వేదిక ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలతో సెకండరీ మార్కెట్లలో ట్రేడింగ్ చేయొచ్చు. ఇకపై సెబీ వద్ద రిజిస్టర్ చేసుకున్న నాన్-బ్యాంక్ (బ్యాంకేతర) బ్రోకర్లు కూడా ఎన్‌డీఎస్-ఓఎం(NDS-OM) వేదికలో ట్రేడింగ్ చేసేందుకు అర్హతను పొందుతారు. తద్వారా బాండ్ల మార్కెట్ పరిధి, లావాదేవీలు రానున్న రోజుల్లో పెరుగుతాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు కూడా బాండ్లలో ట్రేడింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది.

Last Updated : Feb 7, 2025, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details