RBI 2000 Currency Returned : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్ల గురించి శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.62 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని పేర్కొంది. ప్రజల వద్ద ఇంకా రూ.8,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. దాని తరువాత రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 మే 19న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఉపసంహరణ నిర్ణయం తీసుకునే నాటికి దేశంలో దాదాపు 3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉండేవి.
రూ.2000 చట్టబద్ధమే!
రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ, వాటికి చట్టబద్ధత ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కనుక ప్రజలు ఇప్పుడైనా ఈ నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో డిపాజిట్ లేదా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇండియన్ పోస్టు ద్వారా కూడా తమ దగ్గర ఉన్న రూ.2000 నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించవచ్చు.
ఆర్బీఐ ఆఫీసులు
అహ్మదాబాద్, బెంగళూరు, బేల్పుర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపుర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్, దిల్లీ, పట్నా, తిరువనంతపురం. ఎవరి దగ్గర అయితే ఇంకా రూ.2000 ఉన్నాయో, వారు నేరుగా ఈ ఆఫీసులకు వెళ్లి రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు. లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా ఇండియన్ పోస్టు ద్వారా మీ దగ్గర ఉన్న నోట్లను ఈ ఆఫీసులకు పంపవచ్చు. అప్పుడు మీరు పంపిన డబ్బులకు సరిపడా సొమ్మును మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు.
నోట్ : 2016లో డీమోనిటైజేషన్ ప్రకటించిన ఆర్బీఐ, డిపాజిట్ గడవు ముగిసిన తరువాత ఎవరైనా రూ.500, రూ.1000 నోట్లను నిర్దిష్టపరిమితికి మించి కలిగి ఉంటే, దానిని నేరంగా పరిగణిస్తామని స్పష్టంచేసింది. దీనితో ప్రజలు తమ దగ్గర ఉన్న సదరు నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, రూ.2000 నోట్లను ఉపసంహరించుకునేటప్పుడు ఆర్బీఐ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. మొదటిగా రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్‌కు 2023 సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. తరువాత ఈ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అక్టోబర్ 8 నుంచి వ్యక్తులు ఆర్బీఐకు చెందిన 19 ఇష్యూ బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
వాణిజ్య సిలిండర్ ధర రూ.25 పెంపు - వంట గ్యాస్ రేటు ఎంతంటే?
ఎస్బీఐ డెబిట్ కార్డును యాక్టివేట్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!