Ratan Tata Funeral: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు యావత్భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించారు. ముంబయి వర్లీలోని శ్మశానవాటికలో అతిరథ మహారథుల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, టాటా గ్రూపు ఉన్నతోద్యోగులు, పారిశ్రామిక వేత్తలు రతన్ టాటాకు తుది వీడ్కోలు పలికారు. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొన్నారు
నివాళుల్పరించిన ప్రముఖలు
అంతకుముందు ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్ నుంచి వర్లీ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. మహనీయుడిని కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రజల సందర్శనార్థం గురువారం సాయంత్రం 3:30 గంటల వరకు ఎన్‌సీపీఏ గ్రౌండ్లో రతన్ టాటా భౌతిక కాయాన్ని ఉంచారు. ఆ సమయంలో ప్రజలతో ప్రముఖులు నివాళులు అర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబయి వెళ్లి నివాళులు అర్పించారు.