Post Office PPF Scheme Benefits :మధ్య తరగతి ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోస డబ్బును పొదుపు, మదుపు చేసుకోవాలని అనుకుంటారు. ఇందుకోసం బెస్ట్ స్కీమ్స్ ఏమున్నాయా అని చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఇండియన్ పోస్ట్ ఒక బెస్ట్ స్కీమ్‌ను అందిస్తోంది. అదే పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ పథకం. ఏ మాత్రం నష్టభయంలేని, మంచి రాబడిని ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి పథకం ఇది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పథకంలో ఎలా చేరాలి?
ఈ స్కీమ్‌లో భారతీయ పౌరులు ఎవరైనా చేరవచ్చు. నేరుగా పోస్ట్ ఆఫీసులకు వెళ్లి ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. లేదా నిర్దేశిత బ్యాంకుల్లో కూడా ఈ పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ పథకంలో చేరిన వారికి 7.1 శాతం వడ్డీ అందిస్తున్నారు.
కాంపౌండింగ్ ఎఫెక్ట్
ఖాతాదారులు ఒక సంవత్సరంలో కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఈ పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయవచ్చు. ఈ పథకం 15 ఏళ్ల కాలవ్యవధిని కలిగి ఉంటుంది. ఆ తరువాత కూడా ఈ స్కీమ్‌ను మరో 5 ఏళ్లకు పొడిగించుకోవచ్చు. ఈ విధంగా 5 ఏళ్ల బ్లాక్ పీరియడ్‌తో ఎన్నిసార్లు అయినా ఈ స్కీమ్‌ను పొడిగించుకోవడానికి వీలుంటుంది.
ఉదాహరణకు, మీరు 15 ఏళ్లలో మొత్తం రూ.22,50,000 మదుపు చేశారని అనుకుందాం. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం, మీకు దాదాపు రూ.40,68,209 అందుతుంది. మీరు ఈ డబ్బులు తీసుకోకుండా, మరో 5 ఏళ్లపాటు ఆ స్కీమ్‌లోనే కొనసాగారని అనుకుందాం. అప్పుడు మీరు చేసిన పొదుపు మొత్తం రూ.30 లక్షలు అవుతుంది. మీకు వచ్చే రిటర్న్ రూ.66,,58,288 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ పని చేసింది. ఈ విధంగా మీరు చిన్న మొత్తాల్లో పొదుపు చేసి, భారీ స్థాయిలో రాబడులను సంపాదించవచ్చు.
ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హతలు
భారతీయ పౌరులు అందరూ ఈ స్కీమ్‌లో చేరవచ్చు. దీని కాలవ్యవధి 15 సంవత్సరాలు. దీని తరువాత మీరు కావాలనుకుంటే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా 5 ఏళ్ల బ్లాక్ పీరియడ్ చొప్పున ఎన్నిసార్లు అయినా దానిని పొడిగించుకోవచ్చు. అయితే భారతదేశంలో నివసిస్తున్న వారు మాత్రమే పీపీఎఫ్ పొడిగింపునకు అర్హులు. ఇతర దేశాల పౌరసత్వం పొందిన వ్యక్తులు పీపీఎఫ్ ఖాతాలను తెరవడానికి లేదా పొడిగించుకోవడానికి వీలుపడదు.
- మీరు కనుక పీపీఎఫ్ ఖాతాను మరో 5 ఏళ్లపాటు పొడిగించాలని అనుకుంటే, ఖాతా మెచ్యూరిటీ తేదీ కంటే ముందే, సంబంధిత పోస్ట్ ఆఫీస్‌కు లేదా బ్యాంకుకు దరఖాస్తు సమర్పించాలి.
- ఒకసారి ఈ పీపీఎఫ్ ఖాతా తెరచిన తరువాత ఏడాదికి కనీసం రూ.500 అయినా డిపాజిట్ చేయాలి. లేకుంటే పోస్టు ఆఫీసులు లేదా బ్యాంకులు సదరు ఖాతాను క్లోజ్ చేస్తాయి.
- ఇలా క్లోజ్ అయిన పీపీఎఫ్ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయాలంటే, సంవత్సరానికి రూ.50 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
మీ లైఫ్ స్టైల్‌కు - ఏ క్రెడిట్ కార్డు మంచిదో తెలుసా?
ఏఐతో షాపింగ్ మరింత ఈజీ- కొత్త టూల్‌ను లాంఛ్ చేసిన అమెజాన్