PhonePe Firecracker Insurance :దీపావళి అనగానే టపాసులే గుర్తుకు వస్తుంటాయి. పండగ రోజున లక్ష్మీదేవీ పూజ అనంతరం ఎంతో ఆనందంగా పిల్లలు, పెద్దలందరూ క్రాకర్స్ కాలుస్తుంటారు. అయితే, టపాసులు కాల్చే క్రమంలో కొన్నిసార్లు అనుకోకుండా గాయాలవుతుంటాయి. గాయపడిన వారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. ప్రమాదం ఎక్కువ జరిగితే ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే క్రమంలో గాయపడే వారికి పాలసీ కల్పించే ఉద్దేశంతో "ఫోన్‌పే" కొత్త తరహా ఇన్సూరెన్స్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఆ పాలసీ ఏంటి? ఎలా కొనుగోలు చేయాలి? పాలసీ కవరేజీ ఎంత మందికి ఉంటుంది? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఫోన్ పే లాంచ్ చేసిన బీమా ‘ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్’. దీపావళి సందర్భంగా ప్రమాదవశాత్తూ బాణసంచా వల్ల ఎవరైనా గాయపడితే వారికి ఈ బీమా అండగా నిలుస్తుంది. రూ.9 చెల్లించడం ద్వారా రూ.25వేల వరకు కవరేజీ లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 25 నుంచి 10 రోజుల పాటు.. అంటే నవంబర్ 3వ తేదీ వరకు ఈ బీమా కవరేజీ లభిస్తుందని ఫోన్ పే వెల్లడించింది. ఫోన్‌పే యూజర్‌తో పాటు భార్య, పిల్లలు సహా నలుగురు వ్యక్తుల వరకు సమగ్ర కవరేజీ కూడా తీసుకోవచ్చని వెల్లడించింది. అక్టోబర్ 25 తర్వాత కొనుగోలు చేసిన వారికి పాలసీ ఆ రోజు నుంచే కవరేజీ స్టార్ట్ అవుతుంది. దీపావళిని దృష్టిలో పెట్టుకుని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి దీన్ని తీసుకొచ్చినట్లు చెప్పింది.