Wedding With Personal Loan : భారతదేశంలో పెళ్లిళ్లు అంగరంగ వైభోగంగా జరుపుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. మరి మీరు కూడా ఈ సీజన్‌లో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారా? ఇందుకోసం అప్పు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే.
భారతదేశంలో ఏ బ్యాంకు కూడా వివాహం కోసం ప్రత్యేకంగా రుణాలు ఇవ్వడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే అధిక వడ్డీ రేటుకు అప్పులు ఇస్తుంటారు. కానీ ఇది తలకు మించిన భారంగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాస్తవానికి వ్యక్తిగత రుణాలను అసురక్షిత రుణాలుగా భావిస్తుంటారు. అందుకే వీటిపై బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తుంటాయి. ప్రస్తుతానికి చాలా బ్యాంకులు పర్సనల్ లోన్స్‌పై 11 శాతం నుంచి 16 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.
పెళ్లి కోసం అప్పులు చేయవచ్చా?
పెళ్లి కోసం అప్పులు చేయడం సహజమే. అయితే వ్యక్తిగత రుణాలు తీసుకుని వివాహం చేసుకోవడం లేదా చేయడం మంచిది కాదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మరే అవకాశం లేనప్పుడు మాత్రమే, చివరి ప్రయత్నంగా వ్యక్తిగత రుణాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరేమి చేయాలి?
మహిళలైనా, పురుషులైనా సంపాదన ప్రారంభించిన తరువాత, ముందుగా తమ పెళ్లి కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడం మంచిది. మహిళలు బంగారం కొనుక్కోవడం లేదా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మదుపు చేయడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లాంటివి చేయవచ్చు. పురుషులు లార్జ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ తీసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేకపోతే, మంచి వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లలో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. అప్పుడే పెళ్లి సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి.
ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు - ఇప్పుడు ఏం చేయాలి?
ప్రస్తుతానికి చేతిలో డబ్బు లేదు, కానీ అత్యవసరంగా పెళ్లికి డబ్బులు కావాలి, మరే ఇతర మార్గాలు లేవు అనుకున్నవారు వ్యక్తిగత రుణాలు తీసుకోకతప్పదు. కానీ పర్సనల్ లోన్ తీసుకునే వాళ్లు 5 కీలకమైన విషయాలు గుర్తుంచుకోవాలి. అవి:
1. వడ్డీ రేట్లు : మిగతా లోన్స్‌తో పోల్చిచూస్తే, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి చాలా బ్యాంకులు 11 శాతం నుంచి 16 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.