తెలంగాణ

telangana

ETV Bharat / business

పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? ముందుగా ఈ 6 'హిడెన్ ఛార్జీ'ల గురించి తెలుసుకోండి!

Personal Loan Hidden Charges : వ్యక్తిగత రుణం కావాలా? వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజు, పన్నులతో పాటు - ఈ హిడెన్ ఛార్జీలు గురించి కూడా తెలుసుకోవడం మస్ట్‌!

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Personal Loans
Personal Loans (ETV Bharat)

Personal Loan Hidden Charges :మీరు పర్సనల్ లోన్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజు, పన్నులు లాంటి ప్రత్యక్ష రుసుములతోపాటు, పరోక్షంగా వసూలు చేసే 'హిడెన్‌ ఛార్జీలు' గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండగలుగుతారు.

బ్యాంకులు పర్సనల్‌ లోన్స్‌ను అసురక్షిత రుణాలుగా పరిగణిస్తాయి. ఎందుకంటే, ఎలాంటి హామీ లేకుండా బ్యాంకులు ఈ వ్యక్తిగత రుణాలు ఇస్తూ ఉంటాయి. కేవలం రుణ గ్రహీత క్రెడిట్‌ స్కోర్‌, ఆదాయం, ఇప్పటికే ఉన్న రుణాలు మొదలైన వివరాలు మాత్రమే చూస్తాయి. రుణార్హత ఉంటేనే, వ్యక్తిగత రుణాన్ని మంజూరు చేస్తాయి.

వ్యక్తిగత రుణాలు - రుసుములు
బ్యాంకులు పర్సనల్‌ లోన్స్‌పై అనేక రకాలు రుసుములు వసూలు చేస్తాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  1. వడ్డీ : వ్యక్తిగత రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడం సహజమే. అయితే ఈ వడ్డీ అనేది రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్, ఆదాయం, రుణం తీర్చే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే తక్కువ వడ్డీ రేటుకే రుణం లభిస్తుంది. లేకుంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్ ఏమాత్రం బాగా లేకపోతే అసలు రుణం ఇచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది.
  2. ప్రాసెసింగ్ ఫీజు : రుణ గ్రహీత లోన్‌ కోసం అప్లై చేసేటప్పుడు కచ్చితంగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్‌-రిఫండబుల్‌. అంటే బ్యాంకు - రుణగ్రహీతకు లోన్ మంజూరు చేసినా, చేయకపోయినా ఈ డబ్బులు తిరిగి వెనక్కు ఇవ్వడం జరగదు.
  3. పన్నులు :వ్యక్తిగత రుణాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ విషయాన్ని ముందుగానే చెప్పవచ్చు. లేదా కొన్నిసార్లు చెప్పకపోవచ్చు. కానీ చివరకు ఈ పన్నును మాత్రం కచ్చితంగా వసూలు చేస్తాయి.
  4. క్యాన్సిలేషన్ ఫీజు : బ్యాంకులు వ్యక్తిగత రుణం మంజూరు చేసిన తరువాత 'ఫ్రీ లుక్‌ పీరియడ్‌' అవకాశాన్ని ఇస్తాయి. సాధారణంగా ఇది 24-48 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలోపు మీరు లోన్‌ వద్దనుకుంటే, ఎలాంటి పెనాల్టీ వసూలు చేయరు. ఒక వేళ ఈ సమయం తరువాత మీరు లోన్ వద్దనుకుంటే, అప్పుడు బ్యాంకులు మీ నుంచి 'రద్దు రుసుము' (క్యాన్సిలేషన్‌ ఫీజు) వసూలు చేస్తాయి.
  5. ప్రీపేమెంట్ పెనాల్టీ :వ్యక్తిగత రుణం తీసుకున్న తరువాత, దానిని తీర్చేందుకు బ్యాంకులు నిర్ణీత గడువును ఇస్తాయి. కొన్ని సార్లు రుణ గ్రహీత తనకు అనువైన రీతిలో ఈ వ్యవధిని ఎంచుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఈ గడువు కంటే ముందుగానే మీరు రుణం తిరిగి చెల్లించాలని అనుకుంటే, అప్పుడు బ్యాంకులకు 'ప్రీపేమెంట్ పెనాల్టీ' చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది ఎంత అనేది ఆయా బ్యాంకుల నిబంధనలను బట్టి మారుతుంది.

హిడెన్ ఛార్జీలు
పైన చెప్పిన రుసుములతో పాటు, అనేక ఇతర ఛార్జీలు కూడా బ్యాంకులు వసూలు చేస్తాయి. చాలా మందికి ఈ హిడెన్ ఛార్జీల గురించి తెలియదు. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  1. లేట్‌ పేమెంట్ ఫీజు : సకాలంలో ఈఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌) చెల్లించకపోతే, బ్యాంకులు రుణ గ్రహీత నుంచి ఆలస్య రుసుమును వసూలు చేస్తాయి.
  2. ఈఎంఐ డిఫాల్ట్ ఫీజు : కొంత మంది ఈఎంఐ ఆటోపేమెంట్‌ను ఎనేబుల్ చేసుకుంటారు. ఇందుకోసం తమ బ్యాంక్ అకౌంట్‌ను రుణ ఖాతాకు లింక్ చేసి ఉంచుతారు. ఒక వేళ ఈ బ్యాంకు ఖాతాలో ఈఎంఐ చెల్లింపునకు సరిపడా డబ్బు లేకపోతే, అప్పుడు బ్యాంకులు ఈఎంఐ డిఫాల్ట్‌ ఫీజును వసూలు చేస్తాయి.
  3. పీనల్ ఇంట్రెస్ట్‌ : ఇది జరిమానా రూపంలో వసూలు చేసే వడ్డీ. అంటే మీరు చెల్లించని ఈఎంఐపై అదనపు వడ్డీ వసూలు చేస్తారు. సాధారణ వడ్డీ కంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రుణగ్రహీతకు మోయలేనంత భారంగా మారుతుంది.
  4. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీజు : ఉదాహరణకు ఒక వ్యక్తి A అనే బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్నాడు. కొన్నాళ్ల పాటు సక్రమంగా నెలవారీ వాయిదాలు చెల్లించాడు. తరువాత ఆ రుణాన్ని మరో బ్యాంకుకు బదిలీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనితో ముందుగా రుణం మంజూరు చేసిన బ్యాంకు అతని నుంచి 'బ్యాలెన్ ట్రాన్స్‌ఫర్ ఫీజు' వసూలు చేసింది. ఈ విధంగా రుణ గ్రహీతలు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంక్‌కు పర్సనల్‌ లోన్‌ ట్రాన్స్‌ఫర్ చేసుకునేటప్పుడు, కచ్చితంగా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  5. ECS స్వాపింగ్‌ ఫీజు : మీరు ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్ సర్వీస్‌ (ఈసీఎస్‌) చెల్లింపుల కోసం బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చి ఉంటారు. దీని ద్వారా మీరు చెల్లించాల్సిన నెలవారీ వాయిదాల చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. ఒక వేళ మీరు మరో బ్యాంక్‌ ఖాతా నుంచి ఈఎంఐలు చెల్లించాలని నిర్ణయించుకుంటే, అప్పుడు 'ఈసీఎస్‌ స్వాపింగ్ ఫీజు' వసూలు చేస్తారు.
  6. డూప్లికేట్‌ డాక్యుమెంటేషన్ ఛార్జీలు : మీరు పూర్తిగా రుణం తీర్చివేసిన తరువాత నో-డ్యూస్‌ సర్టిఫికెట్ కావాలన్నా, లేదా మరో బ్యాంక్‌కు బ్యాలెన్స్‌ బదిలీ చేయాలన్నా, అందుకు తగిన పత్రాలు బ్యాంకు నుంచి పొందాల్సి ఉంటుంది. అయితే ఈ పత్రాలు అందించేందుకు బ్యాంకులు మీ నుంచి డ్యూప్లికేట్ డాక్యుమెంటేషన్‌ ఛార్జీలు వసూలు చేస్తాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
చాలా మందికి బ్యాంకులు వసూలు చేసే ఈ హిడెన్ ఛార్జీల గురించి తెలియదు. అందువల్ల వ్యక్తిగత రుణాలు తీసుకున్న తరువాత వాటిని తీర్చలేక నానా అవస్థలు పడుతుంటారు. అందుకే రుణాలు తీసుకునే ముందు కచ్చితంగా అన్ని వివరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా రుణం ఇచ్చే బ్యాంకు నియమ, నిబంధనల గురించి, వారు వసూలు చేసే ప్రత్యక్ష, పరోక్ష రుసుములు, పన్నులు గురించి తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌లో వివిధ బ్యాంకులు అందిస్తున్న పర్సనల్‌ లోన్స్ గురించి రీసెర్చ్ చేయాలి. వాటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవాలి. మీకు ఈ విషయాల్లో సరైన అవగాహన లేకపోతే, మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి.

నోట్‌ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, కచ్చితంగా సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్‌ సలహాలు తీసుకోవడం మంచిది.

పెళ్లి కోసం అప్పు - లాభమా? నష్టమా? ఆర్థిక నిపుణుల మాటేంటి? - Wedding With Personal Loan

అర్జెంట్​గా పర్సనల్ లోన్​ కావాలా? కానీ మీ జీతం రూ.25,000లోపే ఉందా? ఎంత రుణం వస్తుందంటే? - Personal Loan On My Salary

ABOUT THE AUTHOR

...view details