Home Decoration with New Paintings : పండుగల వేళ ఇంటికి కొత్త రంగులతో హంగులు అద్దుతుంటారు. దీపావళి పండక్కి అయితే మరీ ఎక్కువ. ఇంటి లోపల, బయట గదికో రంగు అద్దుతూ ఇంద్రధనస్సుగా మారుస్తుంటారు. అస్థిర కర్బన సమ్మేళన (వీవోసీ) కాలుష్య ఉద్గారాలు తక్కువగా ఉన్న రంగులను, అసలు లేని గ్రీన్ పెయింట్స్తోనే ఇంట్లో ఉండేవారికి మేలని ఐజీబీజీ నిపుణులు చెబుతున్నారు. ఇల్లు కొత్తగా ఉండడం ముఖ్యమే కానీ ఇంట్లోని వాతావరణం ఆహ్లాదకరంగా, ఉత్సాహకరంగా ఉండటం అంతకంటే ముఖ్యం. ఇంటికి ఘాటైన రంగులు వేస్తే వాటి వాసన వల్ల ఇంట్లోని వారు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది.
ఈ వాసన వల్ల రోజుల తరబడి అవస్థలు పడాల్సి వస్తుంది. దీనికి కారణం వీవోసీనే. వార్నిష్‌లు, పెయింట్లు, స్నానపు గదులను శుభ్రపర్చే, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, బొద్దింకలు, పురుగుల నివారణకు ఉపయోగించే మందులు, నిర్మాణ వస్తవులు, గృహోపకరణాలు, ప్రింటర్లు, క్రాఫ్ట్ ఉత్పత్తులు వీవోసీ ఉద్గారాలను విడుదల చేస్తుంటాయి. కొన్ని నేరుగా విడుదలైతే మరికొన్ని రసాయన ప్రతిచర్యల ద్వారా ఏర్పడతాయి. దీని వల్ల ఇంట్లో గాలి నాణ్యత తగ్గిపోతుంది. అవుట్‌డోర్ కంటే ఇండోర్ గాలిలోనే వీవోసీ పదిరెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడించాయి.
కొత్త ఇంట్లో అధికం : కొత్త ఇంట్లో అయితే వీవోసీ ఉద్గారాలు అధికంగా విడుదలవుతుంటాయి. నిర్మాణ సామగ్రి, ఫిట్టింగ్‌లు, పెయింట్ వంటివి ఇండోర్ గాలిలో బహిర్గతమవుతాయి. దీంతో బహుళ వీవోసీ వాయువులు విడుదల అవుతుంది. అందుకే మొదట కొన్నినెలల పాటు ఎక్కువ వెంటిలేషన్ ఉండేలా ఇంట్లో తాజా గాలి వచ్చేలా చూస్తుంటారు. వీవోసీ ప్రభావం కాలం ఆధారంగా మారుతుంది. సమ్మర్లో గది ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఎక్కువ వీవోసీ వాయువులు విడుదల అవుతాయి.
అందుకే రంగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంటికి వేసే రంగుల్లో ఉండే వీవోసీలు సూర్యరశ్మి, వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్‌తో చర్య జరపడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్నపిల్లలు, రంగుల వాసన పడనివారు, ఉబ్బసం ఉన్నవారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు తరచూ అనారోగ్యానికి బారిన పడే అవకాశం ఉంది. ఇంటికి లేని, తక్కువ వెదజల్లే రంగులనే ఎంపిక చేసుకోవాలని నిపణులు సూచిస్తున్నారు.
మరి ఎంపిక ఇలా
- వీవోసీ ఏ మేరకు విడుదల చేస్తాయి అనేది రంగుల డబ్బాలపై రాసి ఉంటుంది. కొనుగోలు చేసేటప్పుడు వీటిని పరిశీలించాలి.
- ఈజీగా ఎంపిక చేయడానికి మరో మార్గం ఉంది. తక్కువ వీవోసీ విడుదల చేసే బ్రాండ్లను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) గ్రీన్ పెయింట్స్‌ను ధ్రువీకరిస్తుంది. గ్రీన్ ప్రొ ముద్ర ఉంటే పర్యావరణ హితమైనవిగా సులువుగా గుర్తించవచ్చు.
- ఈ తరహాలో రంగులను ఎంపిక చేస్తే ఇంట్లోవారు తరచూ అనారోగ్యం బారినపడకుండా చూసుకోవచ్చు. గాలి నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుంది.
- ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు.
రంగులు వేయడానికి ముందు
- రంగులు వేయించేటప్పుడు ముందస్తు సన్నద్ధత తప్పనిసరి. దుమ్ము శుభ్రం చేసిన తర్వాతనే, పగుళ్లు పూడ్చిన తర్వాతనే పెయింటింగ్స్ వేయించాలి.
- దీర్ఘకాలం ఉండే మన్నే రంగులను ఎంపిక చేస్తే మేలు. కొంత ఖర్చు పెరిగినా ఎక్కువ రోజులు రావడంతోపాటు ఆర్థికంగా కలిసి వస్తుంది.
- కొన్నిసార్లు గోడలను శుభ్రం చేస్తే కొత్తగా రంగులు వేసే అవసరం ఉండకపోవచ్చు. దీన్ని పరశీలించాలి. అవసరమైతేనే రంగులు వేయించాలి. తక్కువ, అసలు వీవోసీ లేని రంగులనే ఎంపిక చేసుకోవాలి.