Paytm Stocks Rise : మూడు రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొన్న పేటీఎం షేర్లు మరలా పుంజుకున్నాయి. పేటీఎం మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ స్టాక్స్ మంగళవారం ఉదయం నుంచి లాభాల బాట పట్టాయి. బీఎస్ఈలో ఒక్కో పేటీఎం షేరు 7.79 శాతం మేర పెరిగి రూ.472.50 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో ఒక్కో పేటీఎం షేరు ధర 7.99 శాతం పెరిగి రూ.473.55 వద్ద ట్రేడవుతోంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో గత మూడు రోజుల్లో పేటీఎం స్టాక్‌లు 42 శాతానికి పైగా క్షీణించాయి. దీనితో కంపెనీ దాదాపుగా రూ.20,471.25 కోట్లు నష్టపోయింది.
ఆర్‌బీఐ ఏం చెప్పింది?
Why RBI Ban Paytm :పేటీఎం సంస్థకు సంబంధించి ఇటీవల ఆర్‌బీఐ పలు కీలక ఆదేశాల జారీ చేసింది. దీని ప్రకారం, 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తమ ఖాతాదారుల నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. దీనితో వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్టాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు వినియోగించడానికి వీలుపడదు. ఫలితంగానే కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి.
వీటికి మినహాయింపు : ఆర్‌బీఐ
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో కస్టమర్లకు ఉన్న సేవింగ్స్ ఖాతా, కరెంట్ అకౌంట్, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్లు, ఫాస్టాగ్, ఎన్‌సీఎమ్ కార్డులను మాత్రం బ్యాలెన్స్ అయిపోయేంత వరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా వినియోగించుకునే వెసులుబాటును ఆర్‌బీఐ కల్పించింది. అయితే వాలెట్‌కు లింక్ అయి ఉన్న వాటిల్లో మాత్రం అదనంగా డబ్బులను డిపాజిట్ చేసేందుకు ఫిబ్రవరి 29 తరవాత అవకాశం ఉండదు.
పేటీఎం రియాక్షన్!
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో 51 శాతం వాటాను కలిగి ఉన్నారు. మిగతా 49 శాతం వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు చెందినది. ఇక ఇటీవలే తమ సంస్థపై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ట్వీట్ చేశారు.